బాల్యం తీరని చిన్నారిని అమ్ముకున్న కన్నతండ్రి ఐదు లక్షలకు అరబ్ షేక్ కు కూతురి విక్రయం వివాహం కూడా జరిపించినట్లు తల్లి ఆరోపణ తల్లి ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చిన ఘటన

బాల్యం నిండని అమ్మాయిని విక్రయించాడు ఆ కసాయి తండ్రి. బాల్యం తీరని 16 ఏళ్ల చిన్నారిని ఐదు లక్షలకు అమ్మేశాడు. 65 ఏళ్ల వృద్ధుడైన అరబ్ షేక్ కు ఇచ్చి పెళ్లి జరిపించేశాడు. తీరా పెళ్లి చేసి ఒమన్ దేశానికి పంపించాడు. బాలిక తల్లి ఫిర్యాదు చేయడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. వివరాలిలా ఉన్నాయి.

హైదరాబాద్ నగరంలోని నవాబ్ సాహెబ్ కుంట ప్రాంతానికి చెందిన బాలిక తల్లి సయీదా ఉన్నిసా తాజాగా తన కూతురును విక్రయించిన విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన భర్త సికిందర్. అతని సోదరి గౌసియాలు కలిసి పాతబస్తీకి చెందిన ఓ ఖాజీ సాయంతో బార్కాస్ హోటల్ లో పెళ్లి చేశారని సయీదా ఉన్నీసా పోలీసులకు సమర్పించిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

తన భర్త, అతని సోదరి అరబ్ షేక్ నుంచి 5లక్షల రూపాయలు తీసుకొని ఈ పెళ్లి జరిపించారని ఆమె ఆరోపించారు. పెళ్లయ్యాక తన కూతురి పేరిట పాస్ పోర్టు ఇప్పించి ఓమన్ దేశానికి పంపించారని ఆమె చెప్పారు. తన కూతురు వృద్ధుడితో కలిసి విలాసవంతమైన జీవితం గడుపుతున్నట్లు వీడియో చూపించారని ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

తన కూతుర్ని అరబ్ షేక్ కు ఇచ్చి వివాహం చేయడం తనకు ఇష్టం లేదని, తన కూతుర్ని ఒమన్ దేశం నుంచి హైదరాబాద్ కు రప్పించి నిందితులపై చర్యలు తీసుకోవాలని బాలిక తల్లి పోలీసులను వేడుకుంది.

దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.