బిడ్డకు చిన్న దెబ్బ తగిలినా.. తల్లిదండ్రులు అల్లాడిపోతుంటారు. అలాంటిది.. ఓ వ్యక్తి నాలుగేళ్ల కన్న కొడుకుని అతి కిరాతకంగా హత్య చేశాడు. తన చేతులతోనే కొడుకు మెడ నులిమి, నోటితో కొరికి... పిన్నీసుతో గుచ్చి... అత్యంత కర్కశంగా ప్రాణాలు తీశాడు. ఈ సంఘటన నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం తిర్మలరాయిని గుడెంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే...సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగుడెంకి చెందిన చింతల కనకయ్య, స్వప్న దంపతులకు కుమార్తె అక్షిత(6), కుమారుడు అక్షయ్‌(4) ఉన్నారు. బతుకుతెరువు కోసం పిల్లలతో కలిసి వారు కొంతకాలంగా  హదరాబాద్‌లో ఉంటున్నారు. కాగా... నెల రోజుల క్రితం భార్య భర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో..  కనకయ్య కొడుకు అక్షయ్ ని తీసుకొని తన పెదనాన్న చింతల రాములు గ్రామమైన తిర్మలరాయిని గుడెంకి వచ్చాడు.

రోజూ కూలి పనికి వెళ్తు.. నెలరోజులుగా ఇక్కడే ఉంటున్నాడు. చిన్నారి అక్షయ్‌ బాగోగులు చూడటానికి ఇబ్బందిగా ఉందని.. వచ్చి బాలుణ్ని తీసుకెళితే బాగుంటుందని చింతల రాములు కుటుంబ సభ్యులు స్వప్నకు ఫోన్‌ చేసి చెప్పారు. ఆమె అంగీకరించి రెండుమూడు రోజుల్లో వచ్చి తీసుకెళ్తానని చెప్పింది. ఈ విషయం కనకయ్యకు తెలియటంతో ఆగ్రహానికి గురయ్యాడు.

గురువారం బోనాల పండుగ కావడంతో రాత్రి మద్యం తాగి ఉన్మాదిలా మారి అర్ధరాత్రి దాటాక తన పక్కన నిద్రిస్తున్న కుమారుడు అక్షయ్‌ను గొంతు నులమడంతోపాటు శరీరంపై పలుచోట్ల కొరికి, మెడపై పిన్నీసుతో గుచ్చి గుచ్చి కిరాతకంగా హత్య చేశాడు. భార్యకి తన కొడుకు దక్కకూడదనే కోపంతోనే ఇలా చేశాడని కుటుంబసభ్యులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.