ముక్కుపచ్చలారని కూతుర్ని కన్న తండ్రే మంటల్లో విసిరేసి సజీవదహనం చేసిన అమానుష ఘటన నిజామాాబాద్ లో వెలుగుచూసింది.
నిజామాబాద్ : కన్న బిడ్డను మంటల్లో తోసేసి సజీవదహనం చేసాడో కసాయి తండ్రి. మరో కూతుర్ని కూడా అలాగే చంపడానికి ప్రయత్నించగా ఆమె తప్పించుకుంది. భార్యపై కోపంతో అల్లారుముద్దుగా పెంచిన కూతుర్ని దారుణంగా హతమార్చిన ఈ కసాయి తాజాగా అరెస్టయ్యాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే... కామారెడ్డిలోని బీడి కాలనీకి చెందిన కాశీరాం, పోసాని దంపతులు చిత్తు కాగితాలు ఏరుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి సమ్మక్క(10), సారక్క(8) సంతానం. బతుకుదెరువు కోసం ఊరూరూ తిరుగుతూ వుండే ఈ కుటుంబం ఇటీవల నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం బుస్సాపూర్ గ్రామానికి వలస వెళ్లారు. ఈ క్రమంలోనే భార్యాభర్తల మద్య గొడవ జరగడంతో కోపంతో పోసాని ఇంట్లోంచి వెళ్లిపోయింది. దీంతో ఇద్దరు కూతుళ్లు తండ్రి కాశీరాం వద్దే వుండేవారు.
భార్య వదిలివెళ్లిన పిల్లలతో ఆ తండ్రి కూడా అత్యంత కర్కశంగా వ్యవహించాడు. ఇద్దరు కూతుళ్లను చంపి తాను కూడా ఎక్కడికైనా వెళ్లిపోవాలని ఆ కసాయి తండ్రి నిర్ణయించుకున్నాడు. దీంతో కట్టెలను ఒకచోట పెట్టి పెద్ద మంటపెట్టాడు. ఎగసిపడుతున్న మంటల్లో చిన్నకూతురు సారక్కను పడేసాడు. ఆ తర్వాత పెద్దకూతురు సమ్మక్కను కూడా మంటల్లో తోసేందుకు ప్రయత్నించగా ఆమె తప్పించుకుంది.
మంటల్లో కాలిపోతూ చిన్నారి ఆర్తనాదాలు పెట్టడంతో చుట్టుపక్కల వారు గమనించారు. కానీ అప్పటికే సారక్క శరీరమంతా పూర్తిగా కాలిపోవడంతో హాస్పిటల్ కు తరలించినా డాక్టర్లు కాపాడలేకపోయారు. ప్రాణాలు కోల్పోయిన చిన్నారి మృతదేహాన్ని మార్చురీలో భద్రపరిచారు.
అయితే కూతుర్ని చంపి పరారయిన కాశీరాంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పరారీలో వున్న అతడి కోసం గాలించగా శనివారం ఉదయం పోచంపాడు కూడలి వద్ద పోలీసులకు చిక్కాడు. అతన్ని అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరుపర్చి రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.
