జనగామ జిల్లాలో రిటైర్డ్ ఎంపీడీవో నల్ల రామకృష్ణ కిడ్నాప్ కలకలం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఇందుకు సంబంధించి విచారణ చేపట్టిన పోలీసులు.. రామకృష్ణ దారుణ హత్యకు గురైనట్టుగా గుర్తించారు.
జనగామ జిల్లాలో రిటైర్డ్ ఎంపీడీవో నల్ల రామకృష్ణయ్య కిడ్నాప్ కలకలం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఇందుకు సంబంధించి విచారణ చేపట్టిన పోలీసులు.. రామకృష్ణయ్య దారుణ హత్యకు గురైనట్టుగా గుర్తించారు. సుపారీ గ్యాంగ్ ఆయనను హత్య చేసినట్టుగా పోలీసులు నిర్దారణకు వచ్చినట్టుగా తెలుస్తోంది. వివరాలు.. బచ్చన్నపేట మండలం పోచన్నపేట గ్రామానికి చెందిన నల్ల రామకృష్ణయ్య అనే మాజీ ఎంపీడీవో గురువారం సాయంత్రం నుంచి కనిపించకుండా పోయారు. అయితే ఆయన ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పలుచోట్ల గాలింపు చేపట్టారు. అయినప్పటికీ లాభం లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు.
దీంతో పోలీసులు రామకృష్ణయ్య ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలోనే గ్రామ శివారులో మామిడితోట దగ్గర బైక్‌ను గుర్తించిన పోలీసులు.. సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. పోచన్నపేట నుంచి బచ్చన్నపేటకు బైక్‌పై వెళ్తున్న రామకృష్ణను దుండగులు దారిలో ఆపి కిడ్నాప్ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే విచారణ చేపట్టిన పోలీసులు చంపక్ హిల్స్ శివారులో రామకృష్ణ హత్యకు గురైనట్టుగా గుర్తించారు. భూవివాదంలో రామకృష్ణ హత్య జరిగినట్టుగా పోలీసులు నిర్దారణకు వచ్చారు.
ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. మిగిలిన నిందితుల కోసం గాలింపు చేపట్టినట్టుగా సమాచారం. అయితే ఇందుకు సంబంధించి పోలీసులు అధికారికంగా వివరాలు వెల్లడించాల్సి ఉంది. అయితే రామకృష్ణ ఆర్టీఐ చట్టం ద్వారా పలు అక్రమాలను వెలుగులోకి తీసుకొచ్చారని.. ఇదే ఆయన హత్యకు కారణం అయి ఉండొచ్చనే ప్రచారం కూడా సాగుతుంది. ఇదిలా ఉంటే, రామకృష్ణయ్య కుటుంబ సభ్యులు మాత్రం స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ప్రోద్బలంతోనే ఆయన కిడ్నాప్ జరిగిందని ఆరోపించారు. అధికార పార్టీ నేతల కబ్జాలను ఆర్టీఐ ద్వారా వెలుగులోకి తెచ్చారని.. అందుకే కక్ష పెంచుకున్నారని ఆరోపణలు చేశారు. రాజకీయ నాయకులను తప్పించేందుకు పోలీసులు యత్నిస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు. శనివారం మృతదేహం గుర్తిస్తే.. ఇప్పటివరకు తమకు ఎందుకు చూపించడం లేదని ప్రశ్నిస్తున్నారు.
