మద్యానికి బానిసైన కొడుకును గొడ్డలితో నరికి చంపిన తండ్రి

Father kills drunken son in jagityala
Highlights

జగిత్యాల జిల్లాలో దుర్ఘటన

తాగుడుకు అలవాటు తమకు నిత్యం నరకం చూపిస్తున్న ఓ వ్యక్తిని కన్న తండ్రే హతమార్చిన సంఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది. ఫుల్లుగా మద్యం సేవించి ఇంటి ఆరుబయట నిద్రిస్తున్న కొడుకును తండ్రి గొడ్డలితో నరికి హత్య చేశాడు. 

ఈ ఘటనకు సంబంధించిన వివరాలు కింది విధంగా ఉన్నాయి. జగిత్యాల మండలం పొరండ్ల గ్రామానికి చెందిన బోదనపు రవి చిన్న వయసులోనే మద్యానికి అలవాటుపడ్డాడు. ఈ క్రమంలో ఇతడు ఫుల్లుగా మద్యం సేవించి వచ్చి తరచూ భార్యతో పాటు తల్లిదండ్రులతో గొడవకు దిగేవాడు. దీంతో ఈ వేధింపులు తట్టుకోలేక అతడి భార్య గంగవ్వ పుట్టింటికి వెళ్లిపోయింది.

అయినా ఇతడి ప్రవర్తనలో మార్పు రాలేదు. తాగడానికి డబ్బులు ఇవ్వాలంటూ తల్లిదండ్రులను వేధిస్తూ వారిపై దాడులకు దిగేవాడు. అంతే కాకుండా ఊళ్లో వాళ్లతో గొడవలు పడి పరువు తీసేవాడు. దీంతో ఇక భరించలేక పోయిన అతడి తండ్రి రాజం కొడుకును హతమార్చాలనే కఠిన నిర్ణయాన్ని తీసుకున్నాడు.

నిన్న రాత్రి ఫుల్లుగా మద్యం సేవించి ఇంటికి వచ్చిన రవి ఆరుబయట నిద్రపోయాడు. అర్థరాత్రి సమయంలో తండ్రి రాజం గొడ్డలితో  కొడుకుపై దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయాలపాలైన రవి అక్కడికక్కడే మృతి చెందాడు. 

ఈ హత్య జరిగిన విషయాన్ని తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

 

loader