అల్లుడి మీద మామ దాడి, పరిస్థితి విషమం.. తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స..
కూతురిని ఆమె భర్త పెడుతున్న వేధింపులు చూడలేక ఓ మామ అల్లుడి మీద దాడికి దిగాడు. దీంతో తీవ్ర గాయాలపాలైన అల్లుడు ఆస్పత్రిలో చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నాడు.
హైదరాబాద్ : హైదరాబాదులోని పాతబస్తీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కుటుంబంలో ఏర్పడిన చిన్న వివాదం వ్యక్తి హత్యాయత్నం వరకు దారి తీసింది. వివరాల్లోకి వెళితే.. చాంద్రాయణగుట్టలో అల్లుడిపై మామ దాడి చేశాడు. ఈ ఘటనలో అల్లుడు తీవ్రంగా గాయపడ్డాడు. చావు బతుకుల మధ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇస్మాయిల్ అనే వ్యక్తి తన భార్యను తరచుగా వేధిస్తున్నాడు. దీంతో కూతురు బాధ చూడలేని తండ్రి.. అల్లుడిపై దాడి చేశాడు. గ్రానైట్ రాయితో తలపై మోదాడు. దీంతో ఇస్మాయిల్ కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ చికిత్స కొనసాగుతోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఇదిలా ఉండగా, హైదరాబాద్ లోని ఖైరతాబాద్ ప్రేమ్ నగర్ లో ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ జంట మధ్య అనుమానం రాజుకుని ఇద్దరి ప్రాణాలను తీసింది. దీంతో భార్యను నీళ్ళ బకెట్లో ముంచి చంపిన భర్త.. తాను రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హైదరాబాదులోని పంజాగుట్ట డిటెక్టివ్ ఇన్ స్పెక్టర్ నరసింహరాజు తెలిపిన వివరాల ప్రకారం.. అస్సాంకు చెందిన మహానంద బిశ్వాస్ (24), పంపా సర్కార్ (22) ఒకరినొకరు ప్రేమించుకున్నారు. ఏడాదిన్నర కిందట పెళ్లి చేసుకున్నారు. ఆ తరువాత జీవనోపాధి నిమిత్తం కొన్నాళ్ల క్రితం నగరానికి వచ్చారు. వచ్చిన మొదట్లో ఆదిభట్లలోని ఓ సంస్థలో సెక్యూరిటీ గార్డులుగా పని చేశారు. ఆ తర్వాత పంజాగుట్ట సమీపంలోని ప్రేమ్ నగర్ లో ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటూ.. బంజారాహిల్స్ లోని ఓ ప్రముఖ మాల్ లో సెక్యూరిటీ గార్డులుగా చేరారు.
కేసీఆర్ ను కించపర్చేలా నాటకం: ఇద్దరు కళాకారుల అరెస్ట్
అయితే, ఇక్కడికి వచ్చిన కొన్ని రోజులకే భార్య ప్రవర్తనపై మహానంది బిశ్వాస్ కు అనుమానం మొదలయ్యింది. అది రోజులు గడిచిన కొద్దీ పెరుగుతూ వచ్చింది. ఈ అంశంపై ఇద్దరూ తరచూ ఘర్షణ పడేవారు. సోమవారం మధ్యాహ్నం భార్య పంపా సర్కార్ తో మళ్లీ గొడవ పడిన బిశ్వాస్.. ఆమెను బలవంతంగా నిండా నీళ్లు ఉన్న బకెట్లో తల ముంచి హతమార్చాడు. ఆ తరువాత ఆ గదికి తాళం వేసి బయటికి వెళ్లాడు. ఏమనుకున్నాడో ఏమో తెలియదు కానీ.. లక్డీకాపూల్ రైల్వే స్టేషన్ సమీపంలోని వంతెన వద్ద రైలు కిందపడి బలవన్మరణానికి పాల్పడ్డాడు.
అతడి వద్ద లభించిన ప్యాకెట్ డైరీలో అస్సామీ భాషలో.. తన భార్యను చంపి ఆత్మహత్యలకు పాల్పడుతున్నానని రాసి ఉండటాన్ని రైల్వే పోలీసులు గుర్తించారు. దీంట్లో ఇంటి చిరునామా సైతం ఉండటంతో పంజాగుట్ట పోలీసులకు సమాచారం అందించారు. మంగళవారం పంజాగుట్ట పోలీసులు వారి ఇంటి వద్దకు చేరుకుని తాళం పగులగొట్టి చూడగా పంపా సర్కార్ మృతి చెంది ఉండటాన్ని గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.