Asianet News TeluguAsianet News Telugu

సవతి తల్లితో కలిసి కన్నతండ్రి దారుణం.. 14యేళ్ల కవల కుమార్తెల అమ్మకం.. తాళి కట్టి నరకం చూపించిన భర్తలు..

14యేళ్ల కవల కుమార్తెలను రెండో భార్యతో కలిసి అమ్మేశాడో కసాయి తండ్రి.. కొనుక్కున్నవారు పెళ్లి పేరుతో వారిని చిత్రహింసలకు గురి చేశారు. 

father and stepmother sell twin sisters in kamareddy, 7 arrested - bsb
Author
First Published Jan 25, 2023, 6:58 AM IST

కామారెడ్డి : తల్లి లేని పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కన్న తండ్రి వారి పాలిట అత్యంత దారుణంగా వ్యవహరించాడు.  సవతి తల్లి అనే మాటకి సమాజంలో ఉన్న అర్థాన్ని నిజం చేసింది ఆ మారుటి తల్లి. తల్లిని కోల్పోయిన ఇద్దరు కవల  అమ్మాయిల్ని 14 ఏళ్ల వయసు రాగానే వారిద్దరిని అమ్మేశారు ఆ తండ్రి,  సవతి తల్లులు. కవలల్ని.. అందులోనూ ఆడపిల్లల్ని పోషించాల్సి వస్తుందని.. చిన్నతనం నుంచే నరకయాతనలు పెట్టారు. ఆ తర్వాత యుక్త వయసు రాగానే అమ్మేస్తే ఆ కొనుక్కున్నవారు వారిని పెళ్లిళ్లు చేసుకుని.. నరకం చూపించారు.

ఆ ఇతరుల ఓ అమ్మాయి ఎలాగోలా  వివాహం,  భర్త అనే ఆ నరకం నుంచి బయటపడి.. అధికారులను ఆశ్రయించింది. తాను అనుభవించిన హింసను, మానసిక వేదనను వెళ్లగక్కింది. తన కవల సోదరిని కూడా ఇలాగే అమ్మేశారని ఆవేదన వ్యక్తం చేసింది.  దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. మైనర్లను కొని,పెళ్లి చేసుకున్న వారితో సహా ఏడుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు పంపారు. ఈ దారుణమైన ఘటన కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలోని ఓ మారుమూల గ్రామంలో జరిగింది.

ఆర్మూర్ అబ్బాయి.. అమెరికా అమ్మాయి.. వివాహ బంధంతో ఒక్కటయ్యారు.

దీనికి సంబంధించిన వివరాలను మంగళవారం కామారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి ఇలా తెలిపారు…కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలానికి చెందిన ఈ ఆడకవల పిల్లలు రెండేళ్ల వయసు ఉన్నప్పుడే తల్లి అనారోగ్యంతో మరణించింది. ఆ తర్వాత కొద్ది కాలానికి తండ్రి రెండో పెళ్లి చేసుకున్నాడు. వారికి ఓ కొడుకు, కూతురు ఉన్నారు. ఈ క్రమంలో నలుగురిని పోషించడం ఆ తండ్రికి భారంగా తోచింది. 

కాపాడాల్సిన తల్లి లేకపోవడం.. ప్రశ్నించేవారు, ఎదురు చెప్పేవారు ఎవరూ లేకపోవడంతో.. ఆ తండ్రి  ఇద్దరు కవలల్ని అమ్మేస్తే తన భారం తీరుతుందని భావించాడు. ఈ క్రమంలోనే ఈ విషయాన్ని తన దగ్గర బంధువుకు చెప్పాడు. అతను కూడా అది తప్పని చెప్పడం పోయి అతనికి సహకరించాడు. రాజస్థాన్కు చెందిన ఓ వ్యక్తిని తీసుకువచ్చి పరిచయం చేశాడు. ఆ వ్యక్తి.. మరొకరితో కలిసి మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలంలోని  దండుపల్లికి చెందిన శర్మన్  అనే వ్యక్తిని తీసుకొచ్చాడు.

ఆ వచ్చినవారు… కవలలు ఇద్దరినీ పరీక్షించి.. వారిలో చిన్న అమ్మాయిని రూ.80వేలకు కొనుక్కున్నారు. ఆ తర్వాత శర్మన్  ఆ అమ్మాయిని హైదరాబాద్కు తీసుకువెళ్లాడు. అక్కడ ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత తన సొంతూరైన దండుపల్లికి తీసుకువెళ్లి ఆమె మీద శారీరకంగా అత్యాచారం చేస్తూ.. నరకం చూపించాడు. అయితే శర్మాన్ కి అప్పటికే పెళ్లయి పిల్లలు కూడా ఉన్నారు.. అంతేకాదు అనేకమందితో వివాహేతర సంబంధాలు కూడా ఉన్నాయి.  ఈ క్రమంలో బాలిక అతని చేర నుంచి ఎలాగోలా తప్పించుకుంది.

కామారెడ్డికి చేరుకుని డిసిపిఓ స్రవంతిని కలిసింది. తన గోడువెళ్లగక్కింది.తానే కాదు తనతో పాటు తన సోదరుని కూడా మరొక వ్యక్తికి అమ్మేశారని తెలిపింది. ఆమెను సికింద్రాబాద్ లోని బోయిన్పల్లికి చెందిన కృష్ణ కుమార్ కు నిరుడు డిసెంబర్లో 50వేల రూపాయలకు అమ్మేశారని చెప్పుకొచ్చింది. అతను కూడా తన అక్కను పెళ్లి చేసుకుని తనలాగే చిత్రహింసలు పెడుతున్నాడని తెలిపింది. దీంతో షాక్ అయినా బాలల సంరక్షణ అధికారి పోలీసులకు ఈ మేరకు ఫిర్యాదు చేసింది.  

ఆమె ఫిర్యాదు మేరకు బాలికల తండ్రిని, సవతి తల్లిని.. మైనర్లను అక్రమంగా కొని, వివాహం చేసుకొని.. చిత్రహింసలు గురిచేసిన శర్మన్,  కృష్ణకుమార్ లతోపాటు.. మైనర్లను అమ్మడానికి.. వారిని పెళ్లి చేసుకోవడానికి మధ్యవర్తులుగా ఉన్న కాల రాంబాటి, మహేందర్,  రమేష్ లతో కలిసి మొత్తం ఏడుగురి మీద ఫోక్సో కేసు నమోదు చేశారు.  వీరిని అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios