అభం శుభం తెలియిని ఓ మైనర్ బాలికను ఇద్దరు కామాంధులు పొట్టనపెట్టుకున్నారు. వావివరసలు మరిచి తండ్రీ, కొడుకులు కూలీ పనులు చేసుకునే బాలికకు మాయమాటలు చెప్పి లోబర్చుకున్నారు. ఒకరికి తెలియకుండా మరొకరు తరచూ అత్యాచారానికి పాల్పడటంతో బాలిక గర్భం దాల్చింది. ఈ విషయం బైటపడితే  ఊళ్లో పరువుపోతుందని భావించిన బాధిత బాలిక పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద సంఘటన నల్గొండ జిల్లాలో చోటుచేసుకుంది. 

నల్గొండ జిల్లా నాంపల్లి మండలం తిరుమలగిరికి చెందిన ఓ 16ఏళ్ల బాలిక కుటుంబానికి ఆసరాగా ఉండేందుకు కూలీ పనులకు వెళుతుండేది. ఈ క్రమంలో బాలికపై కన్నేసిన భూతం శ్రీను అనే వ్యక్తి మాయమాటలు చెప్పి లోబర్చుకున్నాడు. తరచూ బాలికను తన పొలం వద్ద కలుస్తుండటాన్ని 15 ఏళ్ల వయసున్న శ్రీను కొడుకు గమనించాడు. దీంతో అతడు కూడా ఈ విషయాన్ని బైటపెడతానని బెదిరించి బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఇలా ఇద్దరు  తండ్రీ, కొడుకులు ఒకరికి తెలియకుండా మరొకరు బాధిత బాలికపై తరచూ అఘాయిత్యానికి పాల్పడేవారు.

ఈ క్రమంలో బాలిక ఆరోగ్య పరిస్థితి దెబ్బతినడంతో తల్లిదండ్రులు దేవరకొండలోని ఓ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించగా బాలిక ఏడు నెలల గర్భవతి అని తేలింది. దీంతో ఈ విషయం ఊళ్లో తెలిస్తే పరువు పోతుందని భావించిన బాధిత బాలిక  పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. బాలిక మృతితో ఆగ్రహించిన
గ్రామస్థులు, కుటుంబ సభ్యులు మృతదేహంతో నిందితుల ఇంటి  ముందు నిరసన చేపట్టారు.

బాలిక ఆత్మహత్యపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహంతో నిరసనకు దిగిన వారిని సముదాయించి నిందితులకు కఠిన శిక్ష అమలయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు. దీంతో శాంతించిన వారు నిరసన విరమించి బాలిక అంత్యక్రియలు జరిపారు.