పుట్టిన రోజు వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. ఆనందంగా కేకు కట్ చేసుకొని ఒకరినోరు మరొకొరు తీపి చేసుకున్నారు. కానీ ఆ ఆనందం క్షణాలు కూడా మిగలలేదు. కేకు తిన్న కొద్దిసేపటికే ఇద్దరు మృత్యువాత  పడగా... మరో ఇద్దరు చావు బతుకుల మధ్య కొట్టుమిట్లాడుతున్నారు. ఈ విషాదకర సంఘటన సిద్ధిపేటలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలం ఐనపూర్‌ కి చెందిన రమేష్(39)కి భార్య భాగ్యలక్ష్మి(35), కుమార్తె పూజిత(12), కొడుకు రాంచరణ్(9) ఉన్నారు. కాగా... బుధవారం రాంచరణ్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా రమేష్ తమ్ముడు శ్రీనివాస్ వారికి కేకు పంపించాడు. కుటుంబసభ్యులంందరి మధ్యలో రాంచరణ్ కేకు కట్ చేశాడు. కాగా... ఆ కేకు తిన్న కాసేపటికే వారంతా అస్వస్థతకు గురయ్యారు.

ఈ క్రమంలోనే రాం చరణ్, రమేష్ లు అక్కడికక్కడే మృతి చెందారు. కాగా.. భాగ్యలక్ష్మి, పూజితలు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. గమనించిన స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించగా.... భాగలక్ష్మి, పూజితలు చికిత్స పొందుతున్నారు. వీరి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. వారు తిన్న కేకులో విషం కలిసిందని వైద్యులు చెప్పారు. కాగా... ఆ కేకు పంపిన శ్రీనివాస్ అందులో విషం కలిపినట్లు అనుమానాలు కలుగుతున్నాయి. అన్నదమ్ముల మధ్య భూవివాదమే కారణమని గ్రామస్థులు పేర్కొంటున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.