పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ లిఫ్ట్ పనుల్లో ఘోర ప్రమాదం జరిగింది. కూలీలు పంప్ హౌస్ లోకి దిగుతుండగా క్రేన్ వైర్ తెగిపడింది. దీంతో ఐదుగురు కూలీలు దుర్మరణం పాలయ్యారు.
పాలమూరు : పాలమూరు లిఫ్ట్ పనుల్లో ఘోర ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు కూలీలు మరణించారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వ్యక్తిని చిరిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టులో ఈ ప్రమాదం జరిగింది. కూలీలు పంపుహౌస్ లోకి దిగుతుండగా క్రేన్ వైరు తెగిపడింది. దీంతో సంఘటనా స్థలంలో తీవ్ర విషాద ఛాయలు నెలకొన్నాయి.
ఇదిలా ఉండగా ఈ మార్చిలో ఇలాంటి ప్రమాదమే సంభవించింది. మార్చి 30న పాలమూరు-రంగారెడ్డి పనుల వద్ద సొరంగం పై కప్పు కూలింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ మృతి చెందాడు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రం సమీపంలోని ఉయ్యాలవాడ వద్ద ఈ సంఘటన జరిగింది. విజయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఉయ్యాల వాడకు చెందిన శ్రీనివాస్ రెడ్డి (38) ప్రాజెక్టు పనులు నిర్వహిస్తున్న కంపెనీలో ట్రాక్టర్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు.
ఘటన జరిగిన రోజు ఉదయం పనుల్లో భాగంగా శ్రీనివాస్ రెడ్డి ట్రాక్టర్ నడుపుకుంటూ నలుగురు కార్మికులతో కలిసి సొరంగంలోకి వెళ్లారు. మధ్యలో నీరు నిలవడంతో కార్మికులు పైపుల ద్వారా బయటకు పంపే ప్రయత్నం చేస్తుండగా పైకప్పు ఒక్కసారిగా కూలిపోయింది. శ్రీనివాస్ రెడ్డి తలపై రాళ్ళు పడ్డాయి. తీవ్రగాయాలైన ఆయన తిరిగి తరలిస్తుండగా మధ్యలోనే మృతి చెందారు.
