ఆర్మూర్: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ లో రైతులు బుధవారం నాడు మహా ధర్నా నిర్వహించారు.

ఆర్మూర్ లోని మామిడిపల్లి చౌరస్తాలో రైతులు ఈ ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ ధర్నా చేశారు. సన్నరకం వరి పంటను సాగు చేయాలని ప్రభుత్వం కోరింది. అయితే ఈ పంటను సాగు చేసుకొన్న రైతులకు మద్దతు ధరతో పాటు బోనస్ కూడ ఇవ్వాలని రైతులు కోరారు.

సన్నరకం వరి పంటకు తెగులు వచ్చి తీవ్రంగా నష్టపోయినట్టుగా రైతులు చెబుతున్నారు. సన్నరకం కాకుండా ఇతర రకం వరిని పండిస్తే తాము నష్టపోయేవారం కాదని రైతులు అభిప్రాయపడుతున్నారు.

వరితో పాటు పసుపుకు కూడ మద్దతు ధర విషయంలో ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.రాష్ట్ర ప్రభుత్వం నియంత్రిత పద్దతిలో వ్యవసాయం చేయాలని రైతులను కోరింది. ప్రభుత్వం సూచించిన పంటలను రైతులు సాగు చేశారు. అయితే సన్నరకం వరికి తెగుళ్లు రావడంతో పెద్ద ఎత్తున నష్టపోయినట్టుగా రైతులు చెప్పారు. దొడ్డు రకం వరిని సాగు చేసుకొంటే తమకు ఇబ్బందులు తప్పేవని రైతులు అభిప్రాయంతో ఉన్నారు.

తమకు పరిహారం కూడ కావాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.