తెలంగాణ ప్రభుత్వం అన్నదాతలను ఆదుకోడానికి ప్రకటించిన ''రైతుబంధు''  సాయం అందక ఓ రైతు దారుణానికి పాల్పడ్డాడు. సొంత వ్యవసాయ పొలంలోనే ఓ చెట్టుకు ఉరేసుకుని తనువు చాలించాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. 

ఈ విషాద సంఘటకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. నారాయణఖేడ్ మండలం సత్యగామకు చెందిన వీరారెడ్డి(52) కి ఎనిమిదెకరాల వ్యవసాయయ భూమి వుంది. అయితే ఈ భూమి వ్యవసాయానికి యోగ్యంగా లేకపోవడంతో అతడు కూలీ పనులు చేసుకుంటూ జీవనం కొనసాగించేవాడు. అయితే ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రతి రైతుకు ఎకరానికి రూ.4వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తుండటంతో వీరారెడ్డికి కూడా మొదటివిడతలో రూ.32,800 రూపాయలు అందాయి. 

అయితే రెండో విడత రైతుబంధు పరిహారాన్ని ఎన్నికల కోడ్ మూలంగా ప్రభుత్వం నేరుగా రైతుల ఖాతాలో వేసింది. అయితే సాంకేతిక కారణాల మూలంగా వీరారెడ్డికి చెందిన బ్యాంక్ అకౌంట్లో డబ్బులు జమకాలేదు. ఎన్నిసార్లు అధికారులు,బ్యాంకు చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోయింది. దీంతో తన తీవ్ర మనస్ధాపం చెందిన అతడు సొంత వ్యవసాయ భూమిలోని ఓ చెట్టుకు ఉరేసుకుని ప్రాణాలు విడిచాడు. 

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని స్థానికుల సాయంతో మృతదేహాన్ని కిందకు దించి పోస్టు మార్టం నిమిత్తం నారాయణఖేడ్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.