అకాలవర్షాలు: కామారెడ్డి జిల్లాలో మరో రైతు దుర్మరణం
తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో మరో రైతు దుర్మరణం పాలయ్యాడు. లాక్ డౌన్ కారణంగా ధాన్యం కొనుగోలు కేంద్రానికి వచ్చిన రైతు వడదెబ్బతో మరణించినట్లు తెలుస్తోంది. జిల్లాలో రెండో రైతు మరణం ఇది.
కామారెడ్డి: తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో మరో రైతు మరణించాడు. అకాల వర్షం అతని ఉసురు తీసింది. కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండలం యాడారం గ్రామంలో ధాన్యాన్ని కాపాడుకునే ప్రయత్నంలో చాకలి దేవరాజు (45) అనే రైతు కుప్పకూలిపోయాడు. దాంతో అతను మరణించాడు. అతను వడదెబ్బ కారణంగా మరణించినట్లు భావిస్తున్నారు.
జిల్లాలో అకాల వర్షాలు రైతుల కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. వర్షం నుంచి ధాన్యాన్ని కాపాడుకునే క్రమంలో రైతు ప్రాణాలు విడిచాడు. గత రెండు వారాలుగా జిల్లాలో అకాల వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ధాన్యాన్ని త్వరగా కొనుగోలు చేయాలని వారు ప్రభుత్వానికి మొర పెట్టుకుంటున్నారు.
కామారెడ్డి జిల్లాలో ఇటీవల ఓ రైతు గుండెపోటుతో మరణించాడు. దీంతో కామారెడ్డి జిల్లాలో రైతుల మరణాల సంఖ్య రెండుకు చేరుకుంది. ఇటీవల కామారెడ్డి జిల్లా పోల్కంపేట గ్రామానికి చెందిన భూమయ్యా అనే రైతు గ్రామంలోని కొనుగోలు కేంద్ర వద్ద గుండెపోటుతో మరణించాడు.
భూమయ్య ఈ నెల 19వ తేదీిన కొనుగోలు కేంద్రానికి ధాన్యాన్ని తీసుకుని వెళ్లాడు. ధాన్యాన్ని ఆరబెట్టి అక్కడే సేద తీరాడు. ఆ తర్వాత కాసేపటికే కుప్పకూలిపోయాడు. భూమయ్యకు ముగ్గురు సంతానం కాగా కొడుకు పదేళ్ల క్రితం చనిపోయాడు. ఇద్దరు కూతుల్లు అనారోగ్యంతో మరణించారు. తన కూతుళ్లకు పుట్టిన ముగ్గురు బిడ్డలను అతనే చూసుకుంటున్నాడు.