Asianet News TeluguAsianet News Telugu

బరితెగించిన సైబర్ కేటుగాళ్లు... సిరిసిల్ల కలెక్టర్ పేరుతో భారీ దోపిడీకి స్కెచ్

ఇంతకాలం సామాన్యులను, అమాయకులను టార్గెట్ గా చేసుకుని సైబర్ నేరాలకు పాల్పడ్డ క్రిమినల్స్ మరింత బరితెగించి ఏకంగా జిల్లా కలెక్టర్ పేరిట  నేరాలకు తెరతీసారు. రాజన్న సిరిసిల్ల కలెక్టర్ పేరుచెప్పి భారీగా డబ్బులు వసూలు చేసేందుకు స్కెచ్ వేసారు. 

fake whatsapp account created by cyber criminal in the name of rajanna siricilla collector
Author
Sircilla, First Published May 23, 2022, 10:07 AM IST

సిరిసిల్ల: పూర్వం ఇంత సాంకేతికత లేనప్పుడు దొంగలు ఇళ్లమీదో, బ్యాంకుల మీదో పడి డబ్బులు దోచుకునేవారు. కానీ ఈ డిజిటల్ యుగంలో ఎలాంటి శ్రమ లేకుండానే కంప్యూటర్ ముందు కూర్చునే మన బ్యాంక్ అకౌంట్స్ లోని డబ్బులను ఈజీగా దోచుకుంటున్నారు సైబర్ నేరగాళ్ళు. ఇలా ఇంతకాలం అమాయకులను దోచుకున్న సైబర్ క్రిమినల్స్ (cyber criminals) మరో అడుగు ముందుకేసి ఏకంగా ఐఏఎస్, ఐపీఎస్ లను టార్గెట్ చేసారు. వీరిపై కిందిస్థాయి ఉద్యోగులకు వుండే భయాన్నే పెట్టుబడిగా మోసానికి తెరతీస్తున్నారు. 

ఇప్పటికే తెలుగురాష్ట్రాల్లో పలువురు జిల్లా కలెక్టర్లను, ఉన్నతాధికారులను సైబర్‌ నేరగాళ్లు టార్గెట్‌ చేసిన విషయం తెలిసిందే. తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి (anurag jayanthi) పేరిట సైబర్ నేరగాళ్ళు భారీగా డబ్బుల వసూళ్లకు ప్రయత్నించిన ఘటన వెలుగుచూసింది.  

వివరాల్లోకి వెళితే... సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి పేరిట నకిలీ వాట్సాప్ ఖాతా తెరిచారు నేరగాళ్ళు. కలెక్టర్ ఫోటోతో వున్న ఈ నకిలీ ఖాతానుండి సిరిసిల్ల జిల్లాకు చెందిన అధికారుల నుండి డబ్బులు వసూలు చేసేందుకు సిద్దమయ్యారు. ఇందులోభాగంగా గత రాత్రి ఓ అధికారికి కొంత డబ్బు కావాలంటూ కలెక్టర్ పేరు, ఫోటోతో వున్న ఈ నకిలీ వాట్సాప్ అకౌంట్ నుండి మెసేజ్ చేసారు. అతడికి అనుమానం వచ్చి కలెక్టర్ అనురాగ్ జయంతి ఫోన్ చేయడంతో సైబర్ కేటుగాళ్లు వ్యవహారం వెలుగులోకి వచ్చింది.  

తన వాట్సాప్‌కు వచ్చిన మెసేజ్‌లకు సంబంధించి సమాచారం సదరు అధికారి తెలిపిన వెంటనే కలెక్టర్ అనురాగ్ జయంతి కూడా అప్రమత్తమయ్యారు. ఇది సైబర్‌ నేరగాళ్ల పనేనని గుర్తించిన కలెక్టర్ తన పేరుతో వున్న వాట్సాప్ నంబర్ 7466905844 నుండి సాయం కావాలని, డబ్బులు కావాలని ఎలాంటి మెసేజ్ లు వచ్చినా ఎవరూ స్పందించవద్దని జిల్లా అధికారులందరికీ సమాచారమందించారు. 

ఈ వ్యవహారానికి సంబంధించి జిల్లా అధికారులను అప్రమత్తం చేస్తూ కలెక్టర్ అనురాగ్ జయంతి ఓ ట్వీట్ చేసారు. ''జిల్లా ప్రజలకు విజ్ఞప్తి... జిల్లా కలెక్టర్ ప్రొఫైల్ ఫోటోతో కూడిన వాట్సాప్‌ నం 7466905844 ద్వారా సైబర్ నేరగాళ్లు నకిలీఖాతా సృష్టించి డబ్బులు అడుగుతున్నట్లు నా దృష్టికి వచ్చింది. జిల్లా కలెక్టర్ ఫోటో తో కూడిన నకిలీ వాట్సప్ ఖాతాతో ఎవరైనా డబ్బులడిగితే స్పందించవద్దు...-జిల్లా కలెక్టర్'' అంటూ ఓ ప్రకటన చేసారు. 

ఇక ఇటీవల ఇలాగే నారాయణపేట కలెక్టర్ హరిచందన పేరిట నకిలీ వాట్సాఫ్ అకౌంట్ క్రియేట్ చేసి రూ.2.40లక్షలు దోచుకున్నారు ఓ సైబర్ నేరగాళ్లు. మొదట కలెక్టర్ పేరు, ఫోటోతో ఓ నకిలీ వాట్సాప్ అకౌంట్ క్రియేట్ చేసి జిల్లా అధికారులను డబ్బులు కావాలంటూ మెసేజ్ లు పంపించారు. తాను కీలకమైన సమావేశంలో వున్నాను కాబట్టి ఫోన్ చేసే పరిస్థితి లేదని... అర్జెంట్ గా తనకు కొంత డబ్బు కావాలని ఓ జిల్లా అధికారికి నకిలీ అకౌంట్ నుండి మెసేజ్ పంపారు. నిజంగానే కలెక్టర్ మెసేజ్ చేసాడని భావించిన సదరు అధికారి మూడు విడతలుగ రూ.2.40లక్షలు సైబర్ నేరగాళ్లు సూచించిన ఖాతాలో వేసాడు. 

అయితే తర్వాత అనుమానం వచ్చిన సదరు అధికారి పోలీసులకు సమాచారమిచ్చాడు. దీంతో కలెక్టర్ పేరిట ఎవరో నకిలీ అకౌంట్ క్రియేట్ చేసి ఈ మోసానికి పాల్పడినట్లు బయటపడింది. ఈ మోసానికి పాల్పడిన వాడు ఝార్ఖండ్ వాసిగా పోలీసులు గుర్తించారు. నేషనల్ సైబర్ క్రైం రిపోర్టింగ్ పోర్టల్ కు ఫిర్యాదు చేసి విచారించనున్నట్లు నారాయణపేట జిల్లా ఎస్పీ తెలిపారు. తన పేరిట డబ్బులు కావాలని, సాయం కావాలని ఎవరైనా మెసేజ్ చేస్తే స్పందించవద్దని నారాయణపేట కలెక్టర్ సూచించారు. ఈ వ్యవహారం గురించి మరిచిపోకముందే మరో కలెక్టర్ ను సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేయడం కలకలం రేపుతోంది.  

Follow Us:
Download App:
  • android
  • ios