హైదరాబాద్: నకిలీ డాక్టర్ తేజా రెడ్డిని తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసు అధికారులనే అతను బురిడీ కొట్టించాడు. రాచకొండ పోలీసు కమిషరేట్ పరిధిలో సందడి చేశాడు. పోలీసులకు మందులు అందించాడు. పలువురు ఐపీఎస్ అధికారులను కూడా డాక్టర్ పేరు మీద మోసం చేశాడు. రాచకొండ పోలీసు కమిషనరేట్ కోవిడ్ కేర్ సెంటర్ లో వాలంటీర్ గా పనిచేశాడు. 

రౌడీ షీటర్ వాహనానికి ప్రభుత్వం స్టిక్కర్ అతికించాడు. దానిపై ఆరా తీయడంతో తేజారెడ్డి బాగోతం బయటపడింది. నకిలీ సర్టిఫికెట్లతో పలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో అతను డాక్టర్ గా పనిచేసినట్లు పోలీసులు గుర్తించారు. బెంగళూరులో అతను ఎస్పీనంటూ పోలీసులను బురిడీ కొట్టించారు. బెంగళూరులో అరెస్టయిన ఆ తర్వాత బెయిల్ మీద విడుదలయ్యాడు. ఆ తర్వాత హైదరాబాదుకు మకాం మార్చాడు.

మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండానే రెండో పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. తేజారెడ్డి బ్యాంకులకు 15 లక్షల రూపాయల రుణాలు ఎగవేసినట్లు తెలుస్తోంది. అతను వైఎస్ తేజాగా, అవినాష్ రెడ్డి్, వీరగంధం పేర్లతో చెలామణి అయినట్లు పోలీసులు గుర్తించారు. అతను హైదరాబాదులోని బోడుప్పల్ లో నివాసం ఉంటున్నాడు. 

అతనితో పాటు అతని అనుచురు బోకుడీ శ్రీనివాస రావును, వీరగంధం వెంకట్రావులను కూడా పోలీసులు అరెస్టు చేశారు. తేజా రెడ్డి  వివిధ విద్యాస్థలు, విశ్వవిద్యాలయాల నంచి పొందిన మార్కుల మెమోను, ప్రొవిజనల్ సర్టిఫికెట్లను, మైగ్రేషన్ సర్టిఫికెట్లను, కాన్వోకేషన్ సర్టిఫికెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 4 లక్షల 70 వేల రూపాయల నగదును, రెండు మొబైల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు.