పూజగదిలో నాలుగు కోట్ల బంగారం... బైటికి తీస్తామంటూ ఎనిమిదిలక్షలకు బురిడీ.. నకిలీ బాబాల లీలలు..
మీ పూజగదిలో నాలుగు కోట్ల విలువైన బంగారం ఉంది.. అంటూ నమ్మించి.. ఎనిమిది లక్షల రూపాయలు మోసం చేశారు ఫేక్ బాబాలు. ఈ ఘటన ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
ఘట్కేసర్ : fake babaల గురించి ఎన్ని కథనాలు వచ్చినా.. ఎంత అవగాహన కల్పించినా.. ప్రజల్లో చైతన్యం రావడం లేదు. డబ్బు, బంగారం మీది ఆశ వారిని మాయలో పడేస్తుంది. ఇదే నకిలీ బాబాలకు ఆయుధంగా మారుతోంది. అలా పూజ గదిలో gold వెలికి తీస్తామని మోసం చేసిన నకిలీ బాబాలను అరెస్టు చేసిన ఘటన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా
Ghatkesar Police Stationపరిధిలో చోటు చేసుకుంది. సిఐ ఎన్. చంద్రబాబు తెలిపిన వివరాల ప్రకారం... కరీంనగర్ జిల్లా గన్నేరువరంకి చెందిన మతం చందు, రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లికి చెందిన ఎర్నాళ్ల సంజీవ్ అలియాస్ సంజయ్ బాబాలుగా అవతారమెత్తారు. ఏప్రిల్ 11న ఘట్కేసర్ మండలం ఎదులాబాద్ మాచర్ల రాజు వద్దకు వచ్చి బాబాలుగా పరిచయం చేసుకున్నారు.
మీ ఇంటికి తీసుకు వెళ్లి భోజనం పెడితే అంతా శుభం కలుగుతుందని చెప్పారు. అందుకు అంగీకరించిన ఆయన.. ఇంటికి తీసుకువెళ్లి భోజనం పెట్టారు. ఇంట్లో పూజగది మూసి ఉండడంతో ఆరా తీశారు. సోదరుడి కుమారుడు చనిపోవడానికి పూజలు చేయడం లేదని రాజు పేర్కొన్నాడు. దీంతో ఇంట్లో దెయ్యం ఉందని, అమావాస్య రోజు పూజ చేయాలని, లేకపోతే మరో మరణం సంభవిస్తుందని భయపెట్టి.. మూడు వేలు తీసుకుని వెళ్ళిపోయారు. వారం తర్వాత బాబాలను కలిసి పూజ చేయాలని కోరగా అందుకు వారు రూ.35 వేలు తీసుకుని పూజలు చేసి వెళ్ళిపోయారు.
పదిరోజుల తర్వాత బాబాలు మళ్ళీ వచ్చి మీ ఇంట్లో పూజ గదిలో రూ.4 కోట్ల విలువైన బంగారం ఉందని నమ్మించారు. వారి మాటలు నమ్మిన అతను బంగారం వెలికితీయాలని కోరాడు. అందుకు సిద్దిపేటలో రూ.1.80 లక్షలు విలువ చేసే పూజా సామాగ్రి కొనుగోలు చేయాలని చెప్పారు. అతడిని పూజాసామాగ్రి షాపుకు తీసుకువెళ్లి రూ. 30,000 సామాగ్రి రాజుకు ఇచ్చి పంపించారు. ఆ తరువాత కమిషన్ గా దుకాణదారుడు బాబాలకు 1.5 లక్షలు చెల్లించాడు. ఆ తర్వాత వివిధ పూజల పేరుతో రూ. 7.5 లక్షలు వసూలు చేశారు. పూజలు చేశామని... కొన్ని రోజుల తర్వాత పూజగది తెరిచి చూడాలని చెప్పి వెళ్లిపోయారు.
రోజులు గడుస్తున్నా బంగారం కనిపించకపోవటంతో రాజు కుటుంబం మోసపోయామని గ్రహించారు. దీంతో ఈ నెల 20న పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు ఎస్ఓటి బృందం సాయంతో గాలింపు చేపట్టారు. ఆదివారం నకిలీ బాబాలు ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని వారి వద్దనుంచి రూ. 15 వేల నగదు, కారు, పూజా సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు.