కాంగ్రెస్‌లో వైఎస్సార్‌టీపీ విలీనం, పాలేరులో వైఎస్ షర్మిల పోటీపై స్పందించారు మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత రేణుకా చౌదరి. తాను ఏపీ, తెలంగాణల్లో ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్‌లో వైఎస్సార్‌టీపీ విలీనం, పాలేరులో వైఎస్ షర్మిల పోటీపై స్పందించారు మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత రేణుకా చౌదరి. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. షర్మిలకు పాలేరులో అవకాశం ఇవ్వమని ప్రజలు చెబితే తాను సంతోషంగా తప్పుకుంటానని ఆమె స్పష్టం చేశారు. ఆమె కాంగ్రెస్‌లోకి వచ్చే దాని గురించి తాను ఆలోచించడం లేదని.. అయినా రాష్ట్రం మొత్తం వదిలేసి షర్మిల పాలేరును అంతగా ఎందుకు ఇష్టపడుతుందో తెలియడం లేదని రేణుకా చౌదరి వ్యాఖ్యానించారు.
తాను పార్లమెంట్ బరిలోనా, లేక అసెంబ్లీలోనా అన్నది అధిష్టానం నిర్ణయిస్తుందని ఆమె చెప్పారు. తాను ఏపీ, తెలంగాణల్లో ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చని రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో ముందస్తు ఎన్నికలు వస్తాయంటూ రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు . ఈసారి బీజేపీకి 100 సీట్లు తగ్గుతాయని జోస్యం చెప్పారు. జలగం వెంగళరావు తర్వాత ఖమ్మం జిల్లాను ఆ స్థాయిలో అభివృద్ధి చేసింది తానేనని రేణుకా చౌదరి తెలిపారు.
Also Read: వైఎస్సార్ జయంతి సందర్భంగా రాహుల్ నివాళులు.. వైఎస్ షర్మిల రియాక్షన్ ఇదే..
రేణుక అంటే పొగరు, పౌరుషం అన్నారు. ఖమ్మం మీటింగ్ సందర్భంగా బీఆర్ఎస్ అరాచకాలు చేసిందని అందుకే సభ విజయవంతమైందని రేణుకా చౌదరి చెప్పారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్‌లో ఎలాంటి వర్గ విభేదాలు లేవని.. పొంగులేటికి వ్యతరేకంగా లేనని ఆమె పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వానికి అనుకూలంగా వుండే కిషన్ రెడ్డికి రాష్ట్ర బీజేపీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించారని రేణుకా చౌదరి ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు కరెంట్ షాక్ తప్పదని, బీజేపీ నామరూపాలు లేకుండా పోతుందని ఆమె జోస్యం చెప్పారు.
