సారాంశం

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై మండిపడ్డారు కాంగ్రెస్ నేత, మాజీ కేంద్ర మంత్రి పి.చిదంబరం.  బీఆర్ఎస్‌కు వచ్చే సీట్లతో ఆయన కేంద్రంలో చక్రం ఎలా తిప్పుతారంటూ చిదంబరం సెటైర్లు వేశారు. రాష్ట్రంలోని ప్రాజెక్ట్‌లు కట్టింది, హైదరాబాద్ అభివృద్ధి కాంగ్రెస్ ఘనతేనని ఆయన పేర్కొన్నారు. 

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై మండిపడ్డారు కాంగ్రెస్ నేత, మాజీ కేంద్ర మంత్రి పి.చిదంబరం. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే ఆరు గ్యారెంటీలను ఖచ్చితంగా అమలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ ఎలా ఏర్పడిందో కేసీఆర్‌‌కు సరిగా తెలియదని, చరిత్రపై ఆయనకు సరైన అవగాహన లేదని చిదంబరం దుయ్యబట్టారు. రాష్ట్ర విభజన సమయంలో కేసీఆర్ ఏం మాట్లాడారో తనకు ఇంకా గుర్తుందుని, భాషా ప్రయుక్త రాష్ట్రాల ప్రాతిపదికనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిందని చిదంబరం గుర్తుచేశారు. 

తెలంగాణ ఏర్పడిన తర్వాత పరిస్ధితులు చూసి తనకు అసంతృప్తి కలిగిందని.. రాష్ట్రంలో ధరలు, నిరుద్యోగం పెరిగిపోయాయని ఆయన ఆరోపించారు. కేంద్రంలో చక్రం తిప్పుతానని కేసీఆర్ అంటున్నారని.. బీఆర్ఎస్‌కు వచ్చే సీట్లతో ఆయన కేంద్రంలో చక్రం ఎలా తిప్పుతారంటూ చిదంబరం సెటైర్లు వేశారు. గ్యాస్ సిలిండర్ ధర హైదరాబాద్‌లోనే ఎక్కువగా వుందని.. తెలంగాణలో అర్బన్ నిరుద్యోగిత రేటు దేశ సగటు కంటే ఎక్కువగా వుందని ఆయన మండిపడ్డారు. 

ALso Read: ఇప్పటి వరకు మోసాలే.. మూడోసారి అధికారం కావాలట : కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి ఫైర్

నిరుద్యోగం, అధిక ధరలను నియంత్రించడంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందని , నిరుద్యోగ భృతిని అమలు చేయలేదని చిదంబరం ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో నిరుద్యోగ రేటుకు సంబంధించి మహిళల్లో 9.5 శాతం, పురుషుల్లో 7.8 శాతంగా వుందని ఆయన తెలిపారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ అప్పులు పెరిగిపోయాయని.. రాష్ట్రంలోని ప్రతి పౌరుడిపై సగటున రూ.లక్ష అప్పు వుందని చిదంబరం ఆరోపించారు. రాష్ట్రంలోని ప్రాజెక్ట్‌లు కట్టింది, హైదరాబాద్ అభివృద్ధి కాంగ్రెస్ ఘనతేనని ఆయన పేర్కొన్నారు.