Asianet News TeluguAsianet News Telugu

కాంగ్రెస్ నుంచి కూడా ఆహ్వానం.. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దారెటు..?

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భారత రాష్ట్ర సమితికి గుడ్ బై చెప్పడం దాదాపుగా ఖాయమైనట్టుగా తెలుస్తోంది. ఇటీవల ఖమ్మంలో నిర్వహించిన బీఆర్ఎస్ సభకు కూడా ఆయన దూరంగా ఉన్నారు. 

ex mp ponguleti srinivas reddy Political Future Which party he will be join
Author
First Published Jan 22, 2023, 9:51 AM IST

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భారత రాష్ట్ర సమితికి గుడ్ బై చెప్పడం దాదాపుగా ఖాయమైనట్టుగా తెలుస్తోంది. ఇటీవల ఖమ్మంలో నిర్వహించిన బీఆర్ఎస్ సభకు కూడా ఆయన దూరంగా ఉన్నారు. అయితే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భవిష్యత్ కార్యచరణ ఏమిటనేది ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆయనకు బలమైన పట్టు ఉండటమే  ఇందుకు కారణం అని చెప్పాలి. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాత్రం తన భవిష్యత్తుకు సంబంధించి ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లో తన అనుచరులు, మద్దతుదారులతో ఆత్మీయ సమావేశాలు నిర్వహించిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. శనివారం తన నివాసంలో వివిధ నియోజకవర్గాల నుంచి వచ్చిన ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తాను బీఆర్ఎస్‌లో కొనసాగే అవకాశం లేనట్టుగా పొంగులేటి స్పష్టం చేసినట్టుగా తెలుస్తోంది. 

బీజేపీలో చేరతారని ప్రచారం..
బీఆర్ఎస్‌ను టార్గెట్ చేసుకుని పరోక్ష విమర్శలు చేస్తున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. బీజేపీలో చేరేందుకు రెడీ అయ్యారని కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. పొంగులేటిని పార్టీలో చేర్చుకుని ఖమ్మంలో బలపడాలని కాషాయ పార్టీ భావిస్తుందని, ఇందుకు తెరవెనక మంతనాలు కూడా జరుగుతున్నాయని ప్రచారం కూడా ఉంది. పొంగులేటి కూడా అమిత్ షాను కలవనున్నారనే వార్తలు కూడా వచ్చాయి. అయితే ఆ దిశగా అడుగులు ముందుకు పడటం లేదు. ఈ వార్తలపై పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా బహిరంగంగా స్పందించడం లేదు. దీంతో బీజేపీపై ఆయన వైఖరి ఏమిటనేది స్పష్టంగా తెలియడం లేదు. 

కాంగ్రెస్ నుంచి ఆహ్వానం.. 
మరోవైపు ఖమ్మంలో బలమైన నేతగా ఉన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని తమ పార్టీలో చేర్చుకునేందుకు కాంగ్రెస్ పార్టీ కూడా ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇప్పటికే ఆయనకు కాంగ్రెస్‌ నుంచి ఆహ్వానాలు వెళ్తున్నాయి. ఇటీవల సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క మీడియాతో మాట్లాడుతూ.. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీతో చేతులు కలపాలని కోరారు. దేశవ్యాప్తంగా బీజేపీని ఓడించగల సామర్థ్యం కాంగ్రెస్‌కు మాత్రమే ఉందన్నారు. అలాగే  ఖమ్మం జిల్లాకు చెందిన కొందరు స్థానిక కాంగ్రెస్‌ నేతలు కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని తమ పార్టీలోకి రావాలని ఆశిస్తున్నారు. 

పొంగులేటి నివాసంలో ఆసక్తి పరిణామం.. 
శనివారం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసంలో కొందరు కాంగ్రెస్ నాయకులు ఆయనను కలిశారు. వీరిలో ఖమ్మంకు చెందిన పలువురు కాంగ్రెస్ కార్పొరేటర్లు, నాయకులు ఉన్నారు. ఈ సందర్భంగా వారు పొంగులేటిని తమ పార్టీలో చేరాల్సిందిగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా తాను నిర్ణయం తీసుకోవడానికి ఇంకా సమయం ఉందంటూ పొంగులేటి వారికి చెప్పినట్టుగా తెలుస్తోంది. 

పొంగులేటి దారెటు..
ఈ పరిణామాల నేపథ్యంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి  తన రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే ఏ పార్టీలో చేరాలనే దానిపై తొందరపడి నిర్ణయం తీసుకోకూడదనే ఆలోచనలో పొంగులేటి ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే అందరి అభిప్రాయాలను తీసుకుని, వాటిని క్రోడికరించుకునే పనిలో ఆయన ఉన్నారు. అలాగే భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకోవాలని పొంగులేటి భావిస్తున్నట్టుగా ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఉమ్మడి జిల్లాలోని మరికొన్ని నియోజకర్గాల్లో అనుచరులు, మద్దతుదారులతో సమావేశాలు నిర్వహించిన తర్వాతే.. పొంగులేటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే పొంగులేటికి ఉమ్మడి జిల్లాలోని పలు అసెంబ్లీ నియోజకర్గాల్లో మంచి పట్టు ఉండటంతో.. ఆయన ఏ పార్టీలో చేరితే ఆ పార్టీకి కొంత కలిసివచ్చే వాదనలు ఉన్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios