హైదరాబాద్‌: తెలంగాణ సీఎం కేసీఆర్ పై మాజీ ఎంపీ జి.వివేక్ నిప్పులు చెరిగారు. పక్కన కూర్చోబెట్టుకొని తనకు టికెట్‌ ఇవ్వకుండా సీఎం కేసీఆర్‌ తన గొంతు కోశారని ఆరోపించారు. కేసీఆర్‌ తనను ఇంతలా మోసం చేస్తారని ఎప్పుడూ అనుకోలేదన్నారు. 

తాను కేసీఆర్ ను ఎప్పుడూ టికెట్ అడగలేదని వాళ్లే అనేకసార్లు పెద్దపల్లి టికెట్‌ తనకు ఇస్తామంటూ మభ్యపెట్టారని ఆరోపించారు. బానిసత్వం నుంచి స్వేచ్ఛ వచ్చినట్టు తనకు అన్పిస్తోందని  వివేక్‌ వ్యాఖ్యానించారు. 

తెలంగాణ ఉద్యమంలో తన తండ్రి కాకా పాత్రను ఎవరూ మరచిపోలేరన్నారు. ఆయన దారిలోనే తాము పయనించి రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించినట్లు తెలిపారు. తన అనుచరులు, కార్యకర్తలతో సమావేశమై భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తానని స్పష్టం చేశారు. ఇప్పటికే అనేక పార్టీలు తమ పార్టీలోకి రావాలంటూ ఆహ్వానించాయని అయితే సాయంత్రం తన భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తానని అన్నారు.