బీజేపీ నేతలు నేడు (శనివారం) హైదరాబాద్‌లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ దగ్గర ధర్నాకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.
బీజేపీ మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. తమ కార్యకర్తల పై దాడులు జరిగినా పట్టించుకోవడం లేదంటూ బీజేపీ నేతలు నేడు (శనివారం) హైదరాబాద్‌లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ దగ్గర ధర్నాకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పోలీసులు అప్రమత్తమయ్యారు. పలుచోట్ల బీజేపీ నేతలు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు ఇంట్లో నుంచి బయటకు రాకుండా పోలీసులు ఆయనను గృహ నిర్బంధం చేశారు. మరోవైపు పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్ దగ్గర భారీగా పోలీసులను మోహరించారు.
తనను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారని రామచందర్ రావు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఈరోజు తెల్లవారుజామునే పోలీసులు తనన గృహ నిర్భందం చేశారని చెప్పారు. నిరంకుశ టీఆర్‌ఎస్‌గా తమ ట్యాగ్‌ను సమర్థిస్తూ టీఆర్‌ఎస్ చేసిన మరో చర్య ఇది అని విమర్శించారు. టీఆర్‌ఎస్‌పై పోరాడుతున్నందుకు తనకు ఈరోజు తెల్లవారుజామన ప్రతిఫలం లభించిందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అయితే తాను ఆధునిక నిజాంకు వ్యతిరేకంగా పోరాడుతూనే ఉంటానని చెప్పారు.
గత నెల 27న జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో తమపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఇందుకు సంబంధించి జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్ ఫిర్యాదు చేస్తే పోలీసులు పట్టించుకోలేదని చెబుతున్నారు. పోలీసుల తీరును నిరసిస్తూ శనివారం పోలీసు కమాండ్ కంట్రల్ సెంటర్‌ను మట్టడించాలని బీజేపీ పిలుపునిచ్చింది.
