అధికార బిఆర్ఎస్ పార్టీలో అసెంబ్లీ టికెట్ల వివాదం కొనసాగుతోంది. తాజాగా మరో మాజీ ఎమ్మెల్యే కూడాా పార్టీ నిర్ణయంపై అసంతృప్తితో రాజీనామా చేసారు
నల్గొండ : రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రకటనతో అధికార బిఆర్ఎస్ లో అలజడి రేగింది. బిఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపడ్డ నాయకులు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే పలువురు బిఆర్ఎస్ కు రాజీనామా ప్రకటించగా మరికొందరు అదేబాటలో నడుస్తున్నారు. తాజాగా నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం కూడా బిఆర్ఎస్ కు గుడ్ బై చెప్పనున్నట్లు ప్రకటించారు. ఇవాళ నకిరేకల్ నాయకులతో ఆత్మీయ సమావేశం ఏర్పాటుచేసుకుని చర్చించిన వీరేశం బిఆర్ఎస్ కు రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. ఆయన వర్గానికి చెందిన జడ్పిటిసి, ఎంపిటీసి, సర్పంచ్ లు మూకుమ్మడిగా రాజీనామా చేసారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ అభ్యర్థిగా నకిరేకల్ నుండి పోటీచేసి ఓటమిపాలయ్యారు వేముల వీరేశం. ఆయనపై గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య బిఆర్ఎస్ పార్టీలో చేరాడు. దీంతో నకిరేకల్ లో వీరేశం హవా తగ్గింది. అయినప్పటికి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ టికెట్ తనకే దక్కుతుందని మాజీ ఎమ్మెల్యే భావించాడు. కానీ కేసీఆర్ సిట్టింగ్ లకే టికెట్ కేటాయించడంతో వీరేశం ఆశలు గల్లంతయ్యాయి. దీంతో అదిష్టానంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఇవాళ సన్నిహితులు, అనుచరులతో వీరేశం సమావేశమయ్యారు.
ఇక బిఆర్ఎస్ లో కొనసాగి లాభం లేదని ... కాంగ్రెస్ లో చేరాలని వేముల వీరేశం నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇదే అభిప్రాయాన్ని అనుచరులు కూడా వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీంతో బిఆర్ఎస్ కు రాజీనామా చేసిన వీరేశం కాంగ్రెస్ లో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సర్వేల్లో వీరేశానికి అనుకూలంగా ఫలితాలు వచ్చినట్టుగా ప్రచారం సాగుతుంది.దీంతో వీరేశానికి కాంగ్రెస్ పార్టీలో చేరికకు గ్రీన్ సిగ్నల్ వచ్చే అవకాశం ఉందంటూ చర్చ సాగుతుంది.
Read More కాంగ్రెస్ లో చేరనున్న మాజీ ఎమ్మెల్యే సీతా దయాకర్ రెడ్డి !?
అయితే గతంలోనే వేముల వీరేశం కాంగ్రెస్ లో చేరడానికి ఆసక్తి చూపించగా ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యతిరేకించినట్లు ప్రచారం జరిగింది. మరి ఇప్పుడు వీరేశం చేరికపై కోమటిరెడ్డి ఎలా స్పందిస్తారో చూడాలి.
