తనపై తన కుమార్తె కవితపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు టీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి రెడ్యానాయక్. గోడలకు పెయింట్లు వేసుకునే రేవంత్ రెడ్డి ఇప్పుడు వేల కోట్లకు ఎలా పడగలెత్తారని ఆయన ప్రశ్నించారు.  

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు టీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి రెడ్యానాయక్. హైదరాబాద్‌లో భూముల కోసమే తాము పార్టీ మారినట్లుగా రేవంత్ చేసిన వ్యాఖ్యలకు ఆయన కౌంటరిచ్చారు.గతంలో తనకు కానీ, తన కుమార్తెకు కానీ హైదరాబాద్‌లో సెంటు భూమి కూడా లేదన్నారు. గతంలో వున్నప్పటికీ దానిని అమ్మేశామని రెడ్యా నాయక్ వెల్లడించారు. తనకు భూమి వున్నట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని, ఒకవేళ నిరూపించలేకపోతే రేవంత్ పది చెప్పు దెబ్బలు తింటాడా అని ఆయన సవాల్ విసిరారు. గోడలకు పెయింట్లు వేసుకునే రేవంత్ రెడ్డి ఇప్పుడు వేల కోట్లకు ఎలా పడగలెత్తారని రెడ్యా నాయక్ ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీని ఆయన భ్రష్టుపట్టించారని రెడ్యానాయక్ దుయ్యబట్టారు. రేవంత్ పీసీసీ అయ్యాక జరిగిన రెండు ఎన్నికల్లోనూ కాంగ్రెస్ డిపాజిట్ కోల్పోయిందని ఆయన చురకలంటించారు. రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నారని రెడ్యా నాయక్ ఫైర్ అయ్యారు. 

కాగా.. తన పాదయాత్రలో భాగంగా నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్ మియాపూర్‌లోని కోట్ల విలువైన ఐదెకరాల భూమి మహబూబాబాద్ ఎంపీ బానోత్ కవితకు ఎలా వచ్చిందని ప్రశ్నించారు. ఈ భూమి కోసమే రెడ్యా నాయక్ కాంగ్రెస్‌ను వీడారని ఆయన ఆరోపించారు. ఈ విషయమై కవిత తనతో చర్చకు రావాలని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. నిజం నుంచి ప్రభుత్వ ఆధీనంలో వున్న భూములను కేటీఆర్ మిత్ర బృందం కొల్లగొట్టారని ఆయన ఆరోపించారు.

ALso REad: భూ కబ్జాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ: కేటీఆర్ కు రేవంత్ కౌంటర్, ప్రగతి భవన్ పై ఇలా...

నిషేధిత జాబితాలో చేర్చిన వేలాది ఎకరాల భూములను ధరణి నుంచి తొలగించారన్నారు. తోట చంద్రశేఖర్ ఆదిత్య కన్‌స్ట్రక్షన్స్‌కు ధరణి పేరుతో నిషేధిత భూములను బదలాయించారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రగతి భవన్ ను అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ గా మారుస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు. గడీల విధానానికి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమన్నారు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు ప్రవేశం లేని ప్రగతి భవన్ ఉండి ఉపయోగం ఏమిటని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.