మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు బీజేపీలో చేరారు. సోమవారం బీజేపీ జాతీయాధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో ఆయన కాషాయకండువా కప్పుకున్నారు. మోత్కుపల్లి వెంట తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్, వివేక్, ఎంపీ గరికపాటి మోహన్‌రావు, వీరేందర్ గౌడ్‌లు ఉన్నారు. అనంతరం బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డాను మోత్కుపల్లి కలవనున్నారు. 

రెండేళ్ల క్రితం టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడుపై మోత్కుపల్లి నర్సింహులు తీవ్ర విమర్శలు చేశారు. దీంతో ఆయనను టీడీపీ నుండి బహిష్కరించారు. ఆ తర్వాత కూడ మోత్కుపల్లి నర్సింహులు చంద్రబాబుపై విమర్శలు కురిపించారు. 

ఏపీ రాష్ట్రంలో వైఎస్ఆర్ సీపీ విజయం సాధించాలని తిరుపతి వెంకటేశ్వరస్వామని కోరుకొన్నారు. ఏపీలో వైఎస్ఆర్‌సీపీ విజయం సాధించడంతో ఇటీవలనే ఆయన తిరుపతికి వెళ్లి మొక్కు తీర్చుకొన్నాడు.

Also Read:నేడు బీజేపీలోకి మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు

కొంత కాలంగా ఆయన బీజేపీలో చేరుతారని ప్రచారం సాగుతోంది.ఈ ఏడాది ఆగష్టు 11న ఉదయం మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ఇంటికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు లక్ష్మణ్ బీజేపీలో చేరాలని ఆయనను ఆహ్వానించారు.

వీరిద్దరు నేతలు సుమారు గంట సేపటికి పైగా భేటీ అయ్యారు. బీజేపీలో చేరేందుకు నర్సింహులు కూడ సానుకూలంగా స్పందించారు. గత ఏడాది డిసెంబర్ మాసంలో జరిగిన ఎన్నికల్లో ఆలేరు నుండి నర్సింహులు ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 

2014 ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మధిర నుండి టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. 2009 ఎన్నికల్లో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని తుంగతుర్తి నుండి టీడీపీ అభ్యర్ధిగా నర్సింహులు పోటీ చేసి విజయం సాధించారు.

Also Read:టీఆర్ఎస్ పిలువలేదు, బీజేపీలో చేరుతున్నా:మోత్కుపల్లి

2014 ఎన్నికలకు ముందు రాజ్యసభ సీటు కావాలని చంద్రబాబును కోరారు మోత్కుపల్లి నర్సింహులు. అయితే ఆ సమయంలో గరికపాటి మోహన్ రావుకు చంద్రబాబు నాయుడు రాజ్యసభ టిక్కెట్టు ఇచ్చారు. బీజేపీతో పొత్తు కారణంగా గవర్నర్ పదవిని కూడ ఇస్తామని చంద్రబాబు మోత్కుపల్లి నర్సింహులుకు హామీ ఇచ్చారు.

అయితే గవర్నర్ పదవిని బీజేపీ నేతలు టీడీపీకి ఇవ్వలేదు. దీంతో మోత్కుపల్లి నర్సింహులుకు గవర్నర్ పదవి దక్కలేదు. రాజ్యసభ సీటు రాలేదు. దీంతో ఆయన  అసంతృప్తికి గురయ్యారు. రాజ్యసభ సభ్యుడు గరికపాటి మోహన్ రావు బీజేపీకి జై కొట్టారు.