టీఆర్ఎస్ నేత మండవ వెంకటేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ సహా వివిధ పార్టీలో వున్న అగ్రనేతలను తయారు చేసింది ఎన్టీఆరేనని ఆయన గుర్తుచేశారు. ఆనాడు ఎన్టీఆర్‌కు వ్యతిరేకంగా నిలబడిన రోజు ఇంకా తనను వెంటాడుతోందని మండవ ఆవేదన వ్యక్తం చేశారు. 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (kcr) సహా ఎందరో ప్రముఖ రాజకీయ నాయకులను తయారు చేసింది దివంగత ఎన్టీఆరేనని (ntr) అన్నారు మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు (mandava venkateswara rao) . ఇప్పుడు వివిధ పార్టీలలో వున్న ముఖ్య నేతలంతా టీడీపీలో (tdp) పని చేసిన వారేనని ఆయన తెలిపారు. నాయకులను ఎన్టీఆర్ తయారు చేస్తే... ఆ నాయకులను తీర్చిదిద్దింది టీడీపీ అని మండవ గుర్తుచేశారు. ఆనాడు ఎన్టీఆర్‌కు వ్యతిరేకంగా నిలబడిన రోజు ఇప్పటికీ తనకు బాధను కలిగిస్తుందని వెంకటేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు డిచ్‌పల్లి మండలం ధర్మారం (బి) గ్రామంలో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు జరిగాయి. ఈ సందర్భంగా మండవ పై విధంగా వ్యాఖ్యలు చేశారు.

ఇకపోతే.. టీడీపీలో సీనియర్ నేతగా వున్న మండవ వెంకటేశ్వరరావు 2019 ఉగాది పర్వదినాన సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్‌లో చేరారు. నిజామాబాద్‌ జిల్లాలో కీలక నేతగా ఉన్న మండవ వెంకటేశ్వరరావు డిచ్‌పల్లి, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల నుంచి తెలుగుదేశం అభ్యర్ధిగా పోటీ చేసి పలుమార్లు గెలుపొందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మంత్రిగా, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా పనిచేశారు.

Also Read:టీడీపీకి షాక్: టీఆర్ఎస్ లో చేరిన మాజీమంత్రి మండవ

2009 నుంచి మండవ వెంకటేశ్వరరావు పోటీకి దూరంగా ఉంటున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చెయ్యాలని భావించారు. అయితే పొత్తులో భాగంగా ఆ టికెట్ కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది. దీంతో ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అయితే అదే ఏడాది తెలంగాణ సీఎం కేసీఆర్ జూబ్లీహిల్స్ లోని మండవ వెంకటేశ్వరరావు ఇంటికి వెళ్లి సుమారు గంటన్నరపాటు చర్చించారు. 

అనంతరం పార్టీలోకి రావాలంటూ ఆహ్వానించారు. కేసీఆర్ తో సమావేశమైన అనంతరం మండవ వెంకటేశ్వరరావు టీఆర్ఎస్ పార్టీలో చేరతానని ప్రకటించారు. ప్రకటించిన 24 గంటలలోపే ఆయన కారెక్కేశారు. తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి కీలక నేతగా ఉన్న మండవ వెంకటేశ్వరరావు పార్టీ మారడం టీడీపీ గట్టి దెబ్బ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.