Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణలో కాంగ్రెస్ గెలవబోతోంది .. అడ్డుకోవాలనే, ఐటీ దాడులపై జానారెడ్డి ఆగ్రహం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్‌ అభ్యర్ధులు , ఆ పార్టీ మద్ధతుదారుల ఇళ్లపై ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి . కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రాకుండా అడ్డుకోవడానికే ఈ దాడులు నిర్వహిస్తున్నారని జానారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ex minister janareddy fires on it raids on congress leaders ksp
Author
First Published Nov 3, 2023, 9:53 PM IST

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్‌ అభ్యర్ధులు , ఆ పార్టీ మద్ధతుదారుల ఇళ్లపై ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. గురువారం ప్రారంభమైన దాడులు.. ఇవాళ కూడా కొనసాగాయి. మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి ఇంటిపైనా దాడులు జరగడం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో జానారెడ్డి స్పందించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేలా వుందని అందుకే ఐటీ దాడులు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రాకుండా అడ్డుకోవడానికే ఈ దాడులు నిర్వహిస్తున్నారని జానారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ను బద్నాం చేయడం కోసం ఐటీ దాడులు చేయిస్తున్నారని.. కానీ తాము మాత్రం చట్టబద్ధంగా వ్యవహరిస్తున్నామని జానారెడ్డి స్పష్టం చేశారు. 

కాగా.. త్వరలో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీకే విజయావకాశాలు వున్నాయని పలు సర్వేలు చెబుతున్నాయి. కాంగ్రెస్‌ను నిలువరించేందుకు బీఆర్ఎస్ అధినేత , సీఎం కేసీఆర్ వ్యూహాలు రచిస్తున్నారు. బీజేపీ కూడా రేసులో ముందు నిలిచేందుకు అన్ని అస్త్రాలను బయటకు తీస్తోంది. సరిగ్గా ఈ సమయంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులు, వారి బంధువుల ఇళ్లపై ఐటీ దాడులు కలకలం రేపాయి. అయితే ఇది బీజేపీ పనేనని.. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ అభ్యర్ధుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయడంతో పాటు భయాందోళనలకు గురిచేసేందుకు వ్యూహాత్మకంగా కమలనాథులు ఈ దాడులు చేయిస్తున్నారని హస్తం నేతలు మండిపడుతున్నారు. 

ALso Read: కాంగ్రెస్ పై కేసీఆర్ అంచనాలు తలకిందులు? హస్తానికి పార్టీల మద్దతు పెరగడంతో బీఆర్ఎస్‌లో ఆందోళన!

కల్వకుంట్ల కుటుంబం, బీఆర్‌ఎస్‌ నేతలు ఈ పదేళ్లలో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడినట్లుగా ఆరోపణలు వస్తున్నా బీజేపీ నేతలు పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ నేతలు ఇప్పటికే ఆరోపిస్తున్నారు. రాహుల్ గాంధీ అయితే ప్రతి సభలోనూ ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. దేశంలోని విపక్షనేతలపై ఐటీ, సీబీఐ, ఈడీ దాడులు జరుగుతున్నాయని.. కానీ కేసీఆర్ ఇంటి దరిదాపుల్లోకి కూడా కేంద్ర దర్యాప్తు సంస్థలు వెళ్లడం లేదని రాహుల్ మండిపడుతున్నారు. 

అలాగే ఒవైసీ కుటుంబ సభ్యులపైనా అవినీతి ఆరోపణలు వచ్చినా ఇన్‌కమ్ ట్యాక్స్ దాడులు జరగలేదు. ఏపీలో సీఎం జగన్ అవినీతిపై అమిత్ షా, జేపీ నడ్డా బహిరంగంగా విమర్శలు గుప్పించినా గత పదేళ్లలో ఆయనపై కానీ, ఆయన పార్టీ నేతలపైనా ఎలాంటి ఐటీ దాడులు జరగలేదు. కేసీఆర్, ఒవైసీ, జగన్‌పై ఆదాయపు పన్ను దాడులు ఉండవని, సీబీఐ, ఈడీలు కూడా కేసులు పెట్టబోవని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనికి అదనంగా జగన్‌పై గతంలో ఉన్న సీబీఐ, ఈడీ కేసులు ఏమాత్రం ముందుకు సాగకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.

Follow Us:
Download App:
  • android
  • ios