తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వలసల పరంపర కొనసాగుతూనే వుంది. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ప్రారంభమైన ఈ వలసలు పార్లమెంట్ ఎన్నికల్లోనూ కొనసాగుతున్నాయి. తాజాగా మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి, ఓబిసి సెల్ మాజీ ఛైర్మన్ చిత్తరంజన్ దాస్ టీఆర్ఎస్ లో చేరారు. 

లోక్ సభ ఎన్నికల సందర్భంగా రంగారెడ్డి జిల్లా కడ్తాల్ లోని ఏంబీఏ గార్డెన్స్‌లో టీఆర్ఎస్ పార్టీ ప్రచార సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నిరంజన్‌రెడ్డి సమక్షంలో చిత్తరంజన్ దాస్ టీఆర్ఎస్ లో చేరారు. ప్రస్తుత మంత్రి ఈ మాజీ మంత్రికి గులాబీ కండువా కప్పి పార్టీలో చేర్చుకున్నారు. 

కొద్దిరోజుల క్రితమే చిత్తరంజన్ దాస్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.  ఈ సందర్భంగా తెలంగాణ కాంగ్రెసు వ్యవహారాల ఇంచార్జీ ఆర్.సి. కుంతియాపై, నిజామాబాద్ లోకసభ కాంగ్రెసు అభ్యర్థి మధుయాష్కీపై తీవ్రమైన ఆరోపణలు చేస్తూ చిత్తరంజన్ దాస్ సోనియా గాంధీకి లేఖ రాశారు. వ్యభిచారం కోసం అమెరికాకు మహిళలను తరలించి కుంతియా, మధు యాష్కీ కోట్లాది రూపాయలు సంపాదించారని... రాహుల్ గాంధీ పేరు చెప్పి 75 అసెంబ్లీ టికెట్లు అమ్ముకున్నారని ఆయన ఆరోపించారు. ఇలాంటి వారి నాయకత్వంలో పనిచేయలేకే కాంగ్రెస్ కు రాజీనామా చేస్తున్నట్లు చిత్తరంజన్ దాస్ ఈ లేఖలో పేర్కొన్నారు. 

అయితే ఆయన ఏ పార్టీలో చేరుతున్నది చెప్పకున్నా టీఆర్ఎస్ లో చేరనున్నట్లు ప్రచారం జరిగింది. ఆ ప్రచారాన్ని నిజం చేస్తూ ఆయన తాజాగా టీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. 

మాజీ మంత్రి చిత్తరంజన్ దాస్ కు మహబూబ్ నగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ గా మంచి గుర్తింపు ఉంది.అంతేకాకుండా గతంలో టీడీపీ అధినేత ఎన్టీఆర్ ను సైతం  ఓడించిన చరిత్ర చిత్తరంజన్ దాస్ కు ఉంది. ఇలాంటి నేత పార్టీని వీడటం మహబూబ్ నగర్ కాంగ్రెస్ కు పెద్ద ఎదురుదెబ్బే.