దేశానికి హైదరాబాద్ రెండో రాజధాని అవుతుంది.. అంబేద్కర్ ఆలోచనా ఇదే : విద్యాసాగర్ రావు సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్ దేశానికి రెండో రాజధాని అవుతుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సైతం ఈ విషయాన్ని రాశారని ఆయన తెలిపారు.
బీజేపీ సీనియర్ నేత, మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ దేశానికి రెండో రాజధాని అవుతుందన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజ్యాంగంలోనూ హైదరాబాద్ రాజధాని విషయం గురించి వుందన్నారు. స్మాల్ స్టేట్స్ అనే పుస్తకంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సైతం ఈ విషయాన్ని రాశారని విద్యాసాగర్ రావు అన్నారు.
బొల్లారం, సికింద్రాబాద్, హైదరాబాద్‌లను ఒక రాష్ట్రంగా చేసి.. దానిని దేశ రెండో రాజధానిగా చేయాలని అంబేద్కర్ చెప్పారని విద్యాసాగర్ రావు పేర్కొన్నారు. ఇది దేశ భద్రతకు కూడా మంచిదని అంబేద్కర్ తెలిపారని ఆయన చెప్పారు. పాకిస్తాన్, చైనాలకు హైదరాబాద్ ఎంత దూరంలో వుందనే విషయాన్ని బీఆర్ అంబేద్కర్ వెల్లడించారని విద్యాసాగర్ రావు పేర్కొన్నారు.
హైదరాబాద్ రెండో రాజధానికి సంబంధించిన విషయంపై అన్ని రాజకీయ పార్టీలు చర్చించుకుని ఒక నిర్ణయానికి రావాలని విద్యాసాగర్ రావు సూచించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలపైనా ఆయన స్పందించారు. ఈసారి కూడా బీజేపీ అధికారంలోకి వస్తుందని విద్యాసాగర్ రావు జోస్యం చెప్పారు. తెలంగాణ బీజేపీలో నేతల మధ్య ఎలాంటి విభేదాలు లేవని ఆయన పేర్కొన్నారు.