హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మొట్టమొదటి హోం మంత్రి, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత నాయిని నరసింహారెడ్డి గురువారం తుదిశ్వాస విడిచారు. 86 ఏళ్ల వయసులో ఆయనకు కరోనా సోకడంతో కోలుకోలేకపోయాడు. సెప్టెంబర్ 30వ తేదీన కరోనా సోకడంతో ఆపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న కన్నుమూశారు.  

అయితే అనారోగ్యంతో అదే అపోలోలో చికిత్స పొందుతున్న ఆయన భార్య అహల్య తన భర్తను చూసేందుకు వీల్ ఛైర్ లో వచ్చారు. భర్తను కడసారి చూసేందుకు హాస్పిటల్ నుండి మినిస్టర్ క్వార్టర్స్ కు ప్రత్యేక అంబులెన్స్ లో ఆమెను తీసుకువచ్చారు. ఇప్పటికే తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె భర్త ఇక లేడన్న విషయాన్ని తట్టుకోలేకపోయింది. దీంతో కన్నీరు మున్నీరుగా విలపించారు. 

ఆమె ఆవేదన అక్కడున్నవారికి కూడా కన్నీరు తెప్పించింది. ఇన్నాళ్లు కష్టసుఖాల్లో పాలుపంచుకున్న భర్త మృతదేహాన్ని చూసి ఆమె కన్నీటిపర్యంతమయ్యారు. ఆమెను కుమారుడు దేవేందర్‌ రెడ్డి, కూతురు సమతా రెడ్డి, అల్లుడు శ్రీనివాస్ రెడ్డి, కోడలు శిల్పతోపాటు ఇతర కుటుంసభ్యులు, బంధువులు ఓదార్చారు. 

నాయిని నర్సింహా రెడ్డి పొలిటికల్ జర్నీ (ఫొటోలు)

హైద్రాబాద్ ఫిలింనగర్ మహాప్రస్థానంలో గురువారం మధ్యాహ్నం మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అంత్యక్రియలు జరిగాయి. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించింది ప్రభుత్వం. నాయిని అంత్యక్రియలకు పెద్ద యెత్తున అబిమానులు వచ్చారు. కేటీఆర్ తో పాటు ఇతర మంత్రులు పాడె మోసి తమ అబిమానాన్ని చాటుకున్నారు. 

తెలంగాణ ఉద్యమంలో నాయిని నర్సింహారెడ్డి కీలక పాత్ర పోషించారు. టీఆర్ఎస్ ఆవిర్భావం నుండి ఆయన టీఆర్ఎస్ లోనే కొనసాగారు. ఈ ఏడాది సెప్టెంబర్ 30వ తేదీన ఆయనకు కరోనా సోకింది. దీంతో ఆయన కరోనా చికిత్స కోసం ఆపోలో ఆసుపత్రిలో చేరారు.

కరోనా నుండి కోలుకొన్నప్పటికి ఆయనను శ్వాసకోశ సమస్యలతో బాధపడ్డాడు. ఇదే సమస్యతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి ఆయన మరణించాడు. బుధవారం నాడు ఉదయమే నాయిని నర్సింహారెడ్డిని సీఎం కేసీఆర్  ఆసుపత్రిలో పరామర్శించారు.

మధ్యాహ్నం మినిస్టర్ క్వార్టర్స్ నుండి మహాప్రస్థానం వరకు అంతిమ యాత్ర కొనసాగింది. మహా ప్రస్థానంలో నాయిని నర్సింహా రెడ్డి పార్థీవ దేహం ఉన్న పాడెను మంత్రులు శ్రీనివాస్ గౌడ్, కేటీఆర్ లు మోశారు.

కడసారి నాయిని పార్థీవ దేహాన్ని చూసేందుకు టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, తెలంగాణ వాదులు పెద్ద ఎత్తున స్మశాన వాటికకు చేరుకొన్నారు. పలువురు మంత్రులు, ప్రజా ప్రతినిధులు, పలు పార్టీల నేతలు నాయిని పార్థీవ దేహం వద్ద నివాళులర్పించారు.