టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పూర్వీకులు ఇప్పటి ఆంధ్రప్రదేశ్ లోని విజయ నగరం జిల్లా నుంచి తెలంగాణ ప్రాంతానికి వలస వచ్చినవారేనని మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ నాయకులు జైరాం రమేష్ అన్నారు. ఈ లెక్కన చూసుకుంటే కేసీఆర్ కూడా ఓ సెటిలరేనంటూ  సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇలా వలస వచ్చిన ఓ కుటుంబం ఇప్పుడు  తెలంగాణ ను దోచుకుతింటోందని రమేష్ ఆరోపించారు. 

ఉమ్మడి వరంగల్ జిల్లాలో జైరాం రమేష్ ఇవాళ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...కేసీఆర్ పేరులోనే కోట్లు దాగున్నాయని ఎద్దేవా చేశారు. కేసీఆర్ లో సీఆర్(ఇంగ్లీష్ లో క్రోర్స్) అంటే కోట్లే కదా అని సెటైర్లు విసిరారు. తెలంగాణలో అభివృద్ది పనుల పేరుతో కేసీఆర్ కోట్ల అవినితికి పాల్పడ్డారని జైరాం రమేష్ తీవ్ర ఆరోపణలు చేశారు.

వచ్చే ఎన్నికల్లో ప్రజలు టీఆర్ఎస్ ను ఓడించి వీఆర్ఎస్ (వాలంటరీ రిటైర్మెంట్) ఇవ్వడం ఖాయమన్నారు. తమ ఓటు బలంతో ప్రజలు తెలంగాణలో కేసీఆర్ నియంతృత్వ, రాచరిక పాలనను అంతమొందిస్తారని ఆశిస్తున్నానన్నారు. డిసెంబర్ 11 తర్వాత కేసీఆర్ ఇక ఫాంహౌస్ కే పరిమితమవ్వాల్సి ఉంటుందని జైరాం రమేష్ జోస్యం చెప్పారు.