ఓటర్ల జాబితాలో ఎన్ని సవరణలు చేసినా ఇంకా తప్పులు దొర్లుతూనే వున్నాయి. ఎన్నికల సంఘం ఈ విషయంలో ఎన్ని చర్యలు తీసుకున్నా ఓటర్ల జాబితాపై ప్రజల్లో అపోహలు మాత్రం తొలగడం లేదు. తాజాగా హైదరాబాద్ నాంపల్లి ఓటర్ల జాబితాలోకి కేంద్ర మాజీ ఎన్నికల ప్రధానాధికారి పేరుతో పాటు రాష్ట్ర ఎన్నికల అధికారి రజత్ కుమార్ పేరు కూడా చేరింది. దీనిపై తాము సీరియస్‌గా తీసుకున్నామని... ఈ తప్పిదానికి గల  కారణాలపై దర్యాప్తుకు ఆదేశించినట్లు  సీఈవొ రజత్ కుమార్ తెలిపారు.  

ఇవాళ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా రవీంద్ర భారతిలో ఈసీ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇందులో ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్,  సీఈవో రజత్ కుమార్,  తెలంగాణ సీఈసి నాగిరెడ్డి,  జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ దానకిశోర్‌, సీపీ అంజన్‌ కుమార్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఈవో మాట్లాడుతూ...ఓటర్ల జాబితాలో తప్పులు లేకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా... ఎక్కడో తప్పులు దొర్లుతున్నాయన్నారు. అందువల్లే ఓటర్ల అభ్యంతరాలు, సమస్యలపై గతంలో వున్న 1950 టోల్ ఫ్రీ నంబర్ ను
కొత్త సాప్ట్  వేర్ తో మెరుగుపర్చి అందుబాటులోకి తెచ్చినట్లు పేర్కొన్నారు. 

ఈవీఎంల ట్యాపరింగంవ పై వస్తున్నవన్ని అనుమానాలేనని...అందుులో వాస్తవాలు లేవని రజత్ కుమార్ తెలిపారు. ఈ ట్యాపరింగ్ పై ఆధారాలతో సహ బయటపెడతామని ఎవరైనా ముందుకు వస్తే వారికి సహకరించడానికి ఈసీకి ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. దేశ అత్యున్నత న్యాయస్థానం కూడా ఈవీఎంల ద్వారా జరిగే ఎన్నికలపై ఎలాంటి అనుమానాలు అవసరం లేదని తేల్చిచెప్పిందని రజత్ కుమార్ గుర్తుచేశారు. 

అనంతరం నరసింహన్ మాట్లాడుతూ... 18 ఏళ్లు నిండిన యువత తప్పనిసరిగా ఓటు నమోదు చేసుకుని ఓటింగ్‌లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో 90 శాతం ఓటింగ్‌ జరగాలని తాను ఆకాంక్షిస్తున్నట్లు... అందుకోసం ప్రతిఒక్కరు ఓటింగ్ లో పాల్గొనాలని సూచించారు.