Asianet News TeluguAsianet News Telugu

ఈటల రాజేందర్‌ను హత్య చేసేందుకు కుట్ర.. : జమున సంచలన ఆరోపణ

బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్  సతీమణి ఈటల జమున సంచలన ఆరోపణలు చేశారు. ఈటల రాజేందర్‌ను చంపేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు.

Etela rajender Wife jamuna sensational allegations on mlc kaushik reddy ksm
Author
First Published Jun 27, 2023, 1:51 PM IST


బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్  సతీమణి ఈటల జమున సంచలన ఆరోపణలు చేశారు. ఈటల రాజేందర్‌ను చంపేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఈటల రాజేందర్‌ను రూ. 20 ఇచ్చి కోట్లు చంపిస్తానని కౌశిక్ రెడ్డి అంటున్నారని ఆరోపణలు చేశారు. ఈటల రాజేందర్‌ను చంపిస్తామంటే తాము భయపడమని తెలిపారు. తెలంగాణ ఉద్యమం చేసేటప్పుడు.. నయీం వంటి వ్యక్తులు బెదిరిస్తేనే భయపడలేదని చెప్పారు. కౌశిక్ రెడ్డి మాటల  వెనక కేసీఆర్ ఉన్నారని ఈటల జమున ఆరోపించారు. ఇలాంటి ముఖ్యమంత్రి తెలంగాణ ప్రజలకు అవసరమా? అని  ప్రశ్నించారు. ఆయనకు వ్యతిరేకంగా పనిచేసే వాళ్లను రూ. 20 కోట్లు ఇచ్చి చంపిస్తారా? అని ప్రశ్నించారు. ఇలాంటి కేసీఆర్‌కు రానున్న ఎన్నికల్లో ప్రజలు ఓటుతో బుద్ది చెబుతారని అన్నారు. 

తమ మీద అక్కసుతోనే కౌశిక్ రెడ్డిని కేసీఆర్ ఎమ్మెల్సీ చేశారని జమున ఆరోపించారు. హుజురాబాద్‌లో కౌశిక్ రెడ్డి శాడిస్టులా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ ప్రోత్సహంతోనే కౌశిక్ రెడ్డి చెలరేగిపోతున్నాడని.. హుజురాబాద్ ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారని అన్నారు. సర్పంచ్ మహేందర్ గౌడ్ ఏం చేయకపోయినప్పటికీ జైలులో కౌశిక్ రెడ్డి వేయించాడని.. కొట్టేది ఆయనకు చూపించాలని పోలీసులకు  చెప్పాడని.. ఈ విధంగా శాడిస్టులా వ్యవహరిస్తున్నాడని మండిపడ్డారు.  

గవర్నర్‌పై కూడా కౌశిక్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని జమున అన్నారు. అమరవీరుల స్థూపాన్ని కౌశిక్ రెడ్డి కూలగొట్టించాడని.. శిలాఫలకం మీద ఈటల రాజేందర్ పేరు ఉండొద్దనే కేసీఆర్ చెప్పాడని ఈ పని చేశాడని ఆరోపించారు. కౌశిక్ రెడ్డి తెలంగాణ ఉద్యమకారుడు కాదని.. ఆ సమయంలో ఉద్యమకారులను కొట్టించాడని ఆరోపించారు. అమరవీరుల స్థూపాన్ని కూడా తాకే అర్హత కౌశిక్ రెడ్డికి లేదని అన్నారు. ఉద్యమకారులను గౌరవించని వ్యక్తికి ఎమ్మెల్సీగా ఉండే అర్హత లేదని.. కౌశిక్ రెడ్డిని  ఎమ్మెల్సీ పదవి నుంచి బర్తరఫ్‌ చేయాలని డిమాండ్  చేశారు. 

తెలంగాణ ప్రజలు అనుకుంటే ఏ పార్టీతో అయినా కేసీఆర్‌ను ఓడించడం సాధ్యమేనని అన్నారు. ఈటల రాజేందర్ ఏ పార్టీలో ఉన్న సంతృప్తిగానే ఉన్నారని చెప్పారు. తాము ఎప్పుడు పదవుల కోసం ఆశించలేదని తెలిపారు. కాళ్ళు మొక్కుడు అనేది  తమ రక్తంలో లేదని అన్నారు. తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానని స్పష్టం చేశారు.  ఈటల రాజేందర్‌కు పరోక్ష సహకారం అందిస్తానని చెప్పారు. 

కౌశిక్ రెడ్డి మహిళా ఉద్యోగుల పట్ల అసభ్యంగా ప్రవర్తించారని.. పంచాయితీ సెక్రటరీనీ యూజ్ లెస్ ఫెల్లో అని తిట్టారని..  రైతును సిగ్గు లేదా అని తిట్టారని  ఆరోపించారు. రైస్ మిల్లులు దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారని కూడా ఆరోపణలు చేశారు. తమను కూడా ఆర్థికంగా అనేక ఇబ్బందులు పెడుతున్నారని మండిపడ్డారు. తమ ఇంట్లో ఎవరికేమి జరిగిన కేసీఆర్‌దే  బాధ్యత అని  అన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios