Asianet News TeluguAsianet News Telugu

టీఎస్‌పీఎస్సీ పరీక్ష రాసిన ప్రతి ఒక్కరికీ లక్ష రూపాయలు ఇవ్వాలి.. ఎమ్మెల్యే ఈటల డిమాండ్..

టీఎస్‌పీఎస్సీ పరీక్ష రాసిన ప్రతి ఒక్కరికీ లక్ష రూపాయలు ఇవ్వాలని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. లిక్కర్ స్కాంలో కూతురుని కాపాడుకొనే పనిలో కేసీఆర్ ఉన్నారని.. నిరుద్యోగుల ఆర్తనాదాలు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. 

Etela rajender Slams KCR Over TSPSC Paper Leak ksm
Author
First Published Mar 25, 2023, 3:17 PM IST

టీఎస్‌పీఎస్సీ పరీక్ష రాసిన ప్రతి ఒక్కరికీ లక్ష రూపాయలు ఇవ్వాలని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. మా నౌకరీలు మాగ్గావాలి అంటూ ఇందిరాపార్క్ వద్ద బీజేపీ నిర్వహిస్తున్న నిరుద్యోగ మహాధర్నా కార్యక్రమానికి ఈటల రాజేందర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తెలంగాణ మూడు తరాల ఉద్యమం చేసిందని గుర్తుచేశారు. 1952‌లో ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ ఉద్యమం, 1969లో 369 విద్యార్ధుల బలిదానం, 2001 నుంచి మలిదశ ఉద్యమం సాగిందని చెప్పారు. విద్యార్థుల బలిదానం, ఎంతో మంది ప్రాణత్యాగాల ఫలితమే తెలంగాణ రాష్ట్రం అని అన్నారు. 

1,91,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి అని తెలంగాణ తొలి అసెంబ్లీలో తానే  ప్రకటించానని చెప్పారు.  అయితే ఉద్యోగాల విషయంలో సీఎం కేసీఆర్ యువతను మోసం  చేశారని మండిపడ్డారు. జీహెచ్‌ఎంసీలో 1700 మందినీ ఒక కలం పోటుతో తీసివేస్తే తానే అడ్డుకున్నాని చెప్పారు. కేసీఆర్ వల్ల ఆర్టీసీ‌లో 39 మంది బలైన విషయం మర్చిపోవద్దని అన్నారు. కేసీఆర్ పాలనలో బాగుపడలేదని.. బ్రతికి చెడ్డామని కామెంట్ చేశారు. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ విధానం తీసివేస్తానని చెప్పిన కేసీఆర్ ఇంకా కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. చివరికి టీఎస్‌పీఎస్సీని కూడా ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల చేతిలో పెట్టారని.. ఇంతకంటే సిగ్గుమాలిన, దుర్మార్గ విధానం లేదని విమర్శించారు.  

కేసీఆర్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని విమర్శించారు. నిరుద్యోగులు బిజీ గా ఉంచాలనే నోటిఫికేషన్లు ఆలస్యం చేస్తున్నారని మండిపడ్డారు. టీఎస్‌పీఎస్సీలో 6 పరీక్షల పేపర్లు లీక్ అయ్యాయని.. 30 లక్షల మంది నిరుద్యోగుల్లో బాధ గుండెల్లో నిండిపోయిందని అన్నారు. ఆందోళన చేస్తే ఉస్మానియా విద్యార్థుల మీద కేసులు పెడుతున్నారని, అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ పోలీసులతో రాజ్యం నడపలేరని అన్నారు. 
తెలంగాణ సమాజం కేసీఆర్ మెడలు వంచి భరతం పడుతుందని కామెంట్ చేశారు. 

కేసీఆర్ పాలనలో నిజాయితీకి, ధర్మంకి చోటు లేదని విమర్శించారు. పేపర్‌ లీక్‌తో కేసీఆర్, కేటీఆర్‌లకు సంబంధం లేదని ఎలా చెబుతున్నారని ప్రశ్నించారు. కేసీఆర్‌కు ప్రజల గురించి పట్టించుకునే టైమ్ లేదని మండిపడ్డారు. కేసీఆర్ రాజకీయ కోసమే చూస్తున్నారని విమర్శించారు. పలు అంశాలపై గతంలో కేసీఆర్ వేసిన సిట్‌లు ఏమయ్యాయో ప్రజలందరికీ తెలుసునని అన్నారు. కేసీఆర్ చెప్పు చేతుల్లో ఉండే సిట్‌ల మీద తమకు విశ్వాసం లేదని అన్నారు. పేపర్ లీకేజ్ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నట్టుగా తెలిపారు. టీఎస్‌పీఎస్సీ పేపర్ లేకేజీకి సంపూర్ణ భాధ్యత కేసీఆర్, ఆయన ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. టీఎస్‌పీఎస్సీ పరీక్ష రాసిన ప్రతి ఒక్కరికీ లక్ష రూపాయలు ఇవ్వాలని కోరారు. లిక్కర్ స్కాంలో కూతురుని కాపాడుకొనే పనిలో కేసీఆర్ ఉన్నారని.. నిరుద్యోగుల ఆర్తనాదాలు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. నిరుద్యోగులు ఆత్యహత్యలు చేసుకోవద్దని కోరారు. తాము అండగా ఉంటామని చెప్పారు. కేసీఆర్ ఎల్లకాలం ఉండరని.. రాబోయేది బీజేపీ ప్రభుత్వమని ధీమా వ్యక్తం చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios