ప్రైవేట్ ఆసుపత్రులకు ఈటల సీరియస్ వార్నింగ్: 50 శాతం బెడ్స్ స్వాధీనం చేసుకొంటాం
కరోనా రోగుల నుండి పెద్ద ఎత్తున ఫీజులు వసూలు చేసిన ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అధికారులను ఆదేశించారు.
హైదరాబాద్: కరోనా రోగుల నుండి పెద్ద ఎత్తున ఫీజులు వసూలు చేసిన ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అధికారులను ఆదేశించారు.
ప్రైవేట్ హాస్పిటల్స్ పై ప్రజల నుంచి లిఖితపూర్వకంగా వచ్చిన ఆరోపణలపై వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో మంత్రి ఈటల రాజేందర్ గారు సోమవారం నాడు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు ప్రైవేట్ హాస్పిటల్స్ మీద 1039 ఫిర్యాదులు వచ్చాయన్నారు.
కరోనా రోగుల నుండి మూడు నుండి నాలుగు లక్షలు అడ్వాన్స్ చెల్లిస్తే తప్ప ఆసుపత్రిలో చేర్చుకోకపోవడం లేదంటే పేషెంట్లను కనీసం పరీక్ష చేయకుండానే తిప్పి పంపిస్తున్నారని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ఇన్సూరెన్స్, క్రెడిట్ కార్డు అంగీకరించకపోవడాన్ని కూడ ఆయన ఈ సమావేశంలో ఆయన ప్రస్తావించారు. డబ్బులు చెల్లించినా కూడా రోగులను సరిగా పట్టించుకోకపోవడం లేదన్నారు. చనిపోతే డబ్బులు చెల్లించక పోతే డెడ్ బాడీ ఇవ్వడం లేదంటూ పలు ఫిర్యాదులు అందాయని ఆయన చెప్పారు.
కరోనా లేని వారి దగ్గర కూడా కరోనా ఉందా? లేదా ? తెలుసుకోవడానికి పరీక్షల పేరుతో డబ్బులు వసూలు చేయడం పై కూడా పలు ఫిర్యాదులు అందాయన్నారు.
వేరే జబ్బుల కోసం చికిత్స చేయించుకోవడానికి హాస్పిటల్ కి వచ్చిన వారిని కరోనా నిర్ధారణ పరీక్షల కోసం- కరోనా ప్యాకేజ్ పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారంటూ కంప్లైంట్లు అందాయని మంత్రి తెలిపారు.
వాస్తవానికి కరోనా నిర్ధారణ కోసం రాపిడ్ పరీక్ష లేదా ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేసుకోవడానికి ప్రైవేట్ ఆస్పత్రులకు అనుమతులు ఉన్నాయన్నారు. కానీ అవి పక్కనపెట్టి సిటీ స్కాన్, ఎక్స్రే, రక్త పరీక్షల పేరుతో ఇబ్బందులకు గురి చేస్తున్నారని కంప్లైంట్ చేశారని చెప్పారు.
రక్త పరీక్షల్లో కూడా డీ డీమైర్, ఎల్ డి హెచ్, సి ఆర్ పి, ఫెరిటిన్, ఐఎల్ 6 లాంటి పరీక్షలను అవసరం లేకున్నా కూడా చేస్తున్నారంటూ పలువురు ఫిర్యాదు చేశారని మంత్రి తెలిపారు. హైదరాబాదులో ఉన్న దాదాపు అన్ని ఆసుపత్రులపై ఫిర్యాదులు అందటంతో ప్రతి హాస్పటల్ కు షోకాజ్ నోటీసులు ఇచ్చి వివరణ కోరడం జరిగిందన్నారు.
ఆసుపత్రులు ఇచ్చిన వివరణలను పరిశీలించడానికి వెంటనే ఒక కమిటీ ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు.ఈ వివరణలపై విచారణ చేసి తప్పులు చేసిన ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.
ఇవాళ కేంద్ర బృందంతో జరిగిన సమావేశంలో కూడా ప్రైవేట్ హాస్పిటల్ లో పై తీసుకుంటున్న చర్యలపై చర్చ జరిగింది.రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కేంద్ర బృందం సమర్థించిందని మంత్రి తెలిపారు. అంతేకాకుండా అవసరమైతే ఏపిడమిక్ డిసీజ్ ఆక్ట్ కింద ఇంకా కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర బృందం సూచించిందని మంత్రి తెలిపారు.
ప్రైవేట్ హాస్పిటల్ తమ తీరు మార్చుకోవాలని మరోమారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ కోరారు. ఇంకా ఇలానే కొనసాగితే ప్రతి ప్రైవేట్ ఆస్పత్రిలో ఉన్న ఐసీయూ తో పాటు అన్ని బెడ్స్ లలో 50% బెడ్ లను స్వాధీనం చేసుకొంటామని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో, ప్రభుత్వ నిబంధనల ప్రకారం కరోనా చికిత్సలు జరపటానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.