హుజూరాబాద్: 2018 ఎన్నికల్లో నా ప్రత్యర్థి కి డబ్బులు ఇచ్చి నన్ను ఓడ గొట్టే ప్రయత్నం చేశారని టీఆర్ఎస్ నాయకత్వంపై మాజీ మంత్రి ఈటల రాజేందర్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.బుధవారం నాడు హుజూరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. 20 సంవత్సరాలుగా  రాజకీయాల్లో ఉన్నానని ఆయన గుర్తు చేశారు.అధికారంలో ఉన్న నాడు...లేని నాడు ఎప్పుడైనా తనకు ఉన్నంతలో  పని చేసి ప్రజల మెప్పు పొందానని ఆయన చెప్పారు.మంత్రి హరీష్ రావుపై కూడ ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆత్మగౌరవం తనకు ఉందో హరీష్ రావుకు ఉందో ప్రజలకు తెలుసునని ఆయన అన్నారు. మంత్రి గంగుల కమలాకర్ చిల్లర మాటలు మాట్లాడుతున్నారని ఆయన  విమర్శించారు.

also read:నా పార్టీలోకి వస్తే వద్దంటానా?: ఈటలకు షర్మిల ఆహ్వానం

తమ ఇళ్లలో భర్తలు చనిపోయిన వాళ్ల పెన్షన్ లు పెండింగ్ లో ఉన్నాయని, రేషన్ కార్డులు, కళ్యాణలక్ష్మి పథకం కింద చెక్కులు ఇంకా రాలేదని ప్రజలు తనను కోరుతున్నారని ఆయన  ఈ సందర్భంగా గుర్తు చేశారు. కొత్త పెన్షన్ లు ,రేషన్ కార్డ్ లు వెంటనే ఇవ్వాలని ముఖ్య మంత్రిని డిమాండ్ చేస్తున్నట్టుగా ఆయన చెప్పారు.తాను ఇంత వరకు గాలికి గెలువ లేదని చెప్పారు.  ప్రజలు  తనను నన్ను నమ్మి ఓటు వేస్తే గెలిచానని ఆయన చెప్పారు. ఎంపీ ఎన్నికల్లో 50 వేల పై చిలుకు మెజారిటీ తనను  చూసి ఇచ్చారని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. 

తాను  వేరే పార్టీ పెడుతానని ఏనాడూ కూడ చెప్పలేదన్నారు.తనను పార్టీ నుండి మీరే బహిష్కరించారన్నారు. మీరు తోడుకున్న బొందలో మీ ప్రభుత్వమే పడుతోందని ఆయన జోస్యం చెప్పారు. పోలింగ్ బూతుల్లో విధులు నిర్వహించే మన వాళ్ళే అనుకుంటున్నారని... వారంతా తన గెలుపును కోరుకొంటున్నారని ఈటల రాజేందర్ తెలిపారు.ఈటెల గెలుపు అంటే ఆత్మ గౌరవం గెలుపుగా ఆయన పేర్కొన్నారు. 

కొంత మంది చెంచాలతో తన మీద కరపత్రాలు కొట్టించి ఇబ్బంది చేస్తున్నారన్నారు. అన్నిభరిస్తున్నానంటే ....అది తన సహనం తప్ప భయం కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. తన ప్రజలు తనను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారని చెప్పారు. ఇక్కడ కురుక్షేత్ర యుద్ధం జరుగ బోతుందన్నారు. ధర్మానికి అధర్మానికి జరుగబోయే యుద్ధంగా ఆయన పేర్కొన్నారు. ఈ యుద్ధంలో హుజూరాబాద్ ప్రజలదే విజయమని ఆయన చెప్పారు.