దళిత బంధు అందరికీ ఇవ్వాలి.. లేకుంటే ఉద్యమమే: కేసీఆర్‌కు ఈటల రాజేందర్ హెచ్చరిక
దళిత బంధు అందరికీ ఇవ్వకపోతే ఉద్యమం తప్పదని హెచ్చరించారు మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్. హుజురాబాద్‌లో ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు అందించాలని డిమాండ్ చేశారు
ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు బీజేపీ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్. హుజురాబాద్‌లో ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. హుజురాబాద్‌లో ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు అందించాలని డిమాండ్ చేశారు. దళిత బంధు అందరికీ ఇవ్వకపోతే ఉద్యమం తప్పదని ఈటల స్పష్టం చేశారు.
అంతకుముందు హుజురాబాద్‌లోని ప్రతి కుటుంబానికి దళిత బంధును నూటికి నూరు శాతం అందజేస్తామన్నారు మంత్రి హరీశ్ రావు. శనివారం హుజురాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఎటువంటి చెప్పుడు మాటలు వినొద్దని, అనుమానాలు, అపోహాలకు తావు లేదని తెలిపారు. రైతు బంధు కార్యక్రమాన్ని కూడా హుజురాబాద్ నియోజకవర్గంలోనే కేసీఆర్ ప్రారంభించారని హరీశ్ రావు గుర్తుచేశారు. ఆ సమయంలో కూడా ఇది కొద్దిమందికే వస్తుందని కొందరు.. వున్నత వర్గాలకే వస్తుందని మరికొందరు, ఇది కేవలం ఎన్నికల స్టంట్ అని బీజేపీ, కాంగ్రెస్ నేతలు మాట్లాడారని హరీశ్ రావు ఎద్దేవా చేశారు.
Also Read:కేసీఆర్ పక్కా ప్లాన్: ఈటల రాజేందర్ కు షాక్ ఇచ్చే వ్యూహం
కానీ రైతు బంధు నిరాటంకంగా, కరోనా సమయంలోనూ కొనసాగుతోందని చెప్పారు. ఇదే రైతు బంధుని హుజురాబాద్‌లో ప్రారంభించినప్పుడు చప్పట్లు కొట్టిన నాయకులే .. ఇవాళ దళిత బంధు ప్రారంభిస్తామంటే అదే చేతులతో గుండెలు బాదుకుంటున్నారని మండిపడ్డారు. ఓటమి భయంతో ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని హరీశ్ ఆరోపించారు. పైలట్ ప్రాజెక్ట్ కింద హుజురాబాద్‌లో దళిత బంధుని అమలు చేయడానికి రూ.2000 కోట్లు కేటాయిస్తూ రాష్ట్ర కేబినెట్ తీర్మానం చేసిందని మంత్రి తెలిపారు. హుజురాబాద్‌లోని 20 వేల కుటుంబాలకు లబ్ధి కలుగుతుందని హరీశ్ పేర్కొన్నారు.