కరీంనగర్: దేశ వ్యాప్తంగా రైతాంగంపై రుద్దినటువంటి వ్యవసాయ నల్ల చట్టాలను వ్యతిరేకిస్తూ ఇచ్చిన రేపటి భారత్ బంద్ పిలుపుకు టిఆర్ఎస్ పార్టీ మద్దతు ఇస్తుందని మంత్రి ఈటల రాజేందర్ గుర్తుచేశారు. కాబట్టి రేపు(మంగళవారం) రైతులు చేపట్టే బంద్ లో టిఆర్ఎస్ శ్రేణులు పాల్గొని ఎక్కడిక్కడ నిర్భంధించాలని మంత్రి పిలుపునిచ్చారు. రైతులకు సంఘీభావం తెలుపుతూ ఈ బంద్ కార్యక్రమంలో తాను కూడా పాల్గొంటానని మంత్రి వెల్లడించారు.

''వ్యాపార వాణిజ్య వేత్తలు ఈ బంద్ కు సంపూర్ణంగా మద్దతు తెలపాలి. దేశ వ్యాప్తంగా రైతాంగంపై రుద్దినటువంటి వ్యవసాయ నల్ల చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెంటనే విత్ డ్రా చేసుకోవాలి. నల్ల చట్టాలను వ్యతిరేకిస్తూ ఎముకలు కోరికే చలిలో ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో రైతుల నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. వ్యవసాయాన్ని కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టే దుర్మార్గమైన చర్యలు ఆపాలి. రైతుల కష్టాన్ని కార్పొరేట్ కంపనీలకు పణంగా పెట్టే చర్యలు మానుకోవాలి'' అని కేంద్రాన్ని కోరారు మంత్రి ఈటల.

ఇప్పటికే నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ ఈ నెల 8వ తేదీన రైతులు తలపెట్టిన భారత్ బంద్ కు మద్దతుగా తమ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులంతా ఆందోళనలో పాల్గొంటారని తెలంగాణ మంత్రి కేటీఆర్ చెప్పారు. ఆదివారంనాడు కొత్తగా ఎన్నికైన జీహెచ్ఎంసీ కార్పోరేటర్లతో సమావేశం ముగిసిన తర్వాత ఆయన తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. కేంద్రం అప్రజాస్వామికంగా వ్యవసాయ చట్టాల్ని దేశంపై రుద్దిందని తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ చెప్పారు.

నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ రైతులు ఢిల్లీలో ఆందోళన చేస్తున్న రైతులకు తమ పార్టీ సంపూర్ణ మద్దతును ప్రకటించిందన్నారు. రైతు బిడ్డగా ఈ చట్టాలను నిరసిస్తూ రైతులకు ఆందోళన చేపట్టినట్టుగా చెప్పారు. ఎముకలు కొరికే చలిలో ఆందోళన చేస్తున్న రైతులకు సెల్యూట్ చేస్తున్నట్టుగా కేటీఆర్ ప్రకటించారు.రైతులకు సంఘీభావంగా ఈ నెల 8వ తేదీన తలపెట్టిన భారత్ బంద్ కు సంపూర్ణ మద్దతును ప్రకటిస్తున్నట్టుగా కేటీఆర్ తెలిపారు.

 ఈ నెల 8వ తేదీన రైతులకు మద్దతుగా కనీసం రెండు గంటల పాటు వ్యాపారవర్గాలు దుకాణాలు మూసివేసి  రైతాంగానికి మద్దతు ప్రకటించాలని ఆయన కోరారు.రవాణా రంగంలోని వారు కూడ బంద్ కు సహకరించాల్సిందిగా కోరారు. రూ. 60 వేల కోట్లు వ్యవసాయ రంగంపై తెలంగాణ ప్రభుత్వం ఖర్చు చేస్తోందని ఆయన చెప్పారు. తెలంగాణ ఉద్యమం జరిగినట్టుగా బంద్ విజయవంతం కావాల్సిన అవసరం ఉందన్నారు.తెలంగాణలో బంద్ ను విజయవంతం చేసి ఢిల్లీలో రైతులకు సంఘీభావం తెలపాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు.