తెలంగాణ కార్మిక శాఖ పరిధిలోని వైద్య బీమా సేవల విభాగం ఈఎస్ఐకి మందులు సరఫరా చేసే విషయంలో భారీ కుంభకోణం జరిగింది. కాగా... ఈ కుంభకోణానికి బాధ్యురాలిని చేస్తూ... ఈఎస్ఐ డైరెక్టర్ దేవికా రాణిని శుక్రవారం ఉదయం ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఆమెను బంజారాహిల్స్ లోని ఏసీబీ కార్యాలయానికి తరలించారు.

గురువారం నుంచే ఏసీబీ అధికారులు దేవికా రాణి ఆఫీసులో తనిఖీలు నిర్వహించిన సంగతి తెలిసిందే. కాగా ఈ రోజు అదుపులో తీసుకున్నారు. ఈఎస్ఐ మందుల కొనుగోలు స్కాంలో దేవికారాణి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు వ్యక్తుల నుంచి మందులు కొనడం, అసలు కొనకుండానే కొని, ఆస్పత్రులకు సరఫరా చేసినట్లు బిల్లులు సృష్టించడం లాంటి చర్యలతో రాష్ట్ర ఖజానాకు కనీసం పది కోట్ల రూపాయలకు పైగా నష్టం కలిగించినట్లు అవినీతి నిరోధక శాఖ దర్యాప్తులో తేలింది. 

ఈ నేపథ్యంలో 17 మంది ప్రభుత్వ ఉద్యోగులు, నలుగురు ప్రైవేటు వ్యక్తులపై ఏసీబీ అవినీతి నిరోధక చట్టం వివిధ సెక్షన్ల కేసులు నమోదు చేసింది. గత ఏడాది జరిగిన కుంభకోణంలో భాగస్వాములైన వైద్య బీమా సేవల డైరెక్టర్‌ డాక్టర్‌ సీహెచ్‌ దేవికారాణి, జాయింట్‌ డైరెక్టర్‌ కె.పద్మ సహా మొత్తం 21 మంది ఇళ్లు, కార్యాలయాల్లో గురువారం పెద్ద ఎత్తున సోదాలు జరిపింది.

గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు జరిగిన సోదాల్లో పలు కీలక పత్రాల్ని స్వాధీనం చేసుకున్నారు. ఐఎంఎస్‌ విభాగంలో అవినీతి, అవకతవకలపై విజిలెన్స్‌ విభాగం నుంచి సమాచారం అందిన వెంటనే నిజం నిగ్గు తేల్చాలని ప్రభుత్వం ఏసీబీని ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన ఏసీబీ వైద్య బీమా సేవల విభాగం డైరెక్టర్‌తో పాటు మరికొందరు వ్యక్తులు కలిసి నకిలీ ఇండెంట్లు తయారు చేసి ప్రభుత్వ ఖజానాను కొల్లగొట్టినట్లు గుర్తించింది. దీనిలో భాగంగానే... ఈరోజు దేవికా రాణిని అదుపులోకి తీసుకున్నారు.


 
రికార్డులను తారుమారు చేయడం, మందులు, సర్జికల్‌ కిట్ల కొనుగోలు సమయంలో రూల్స్‌ను అతిక్రమించడం ద్వారా ప్రభుత్వ ఖజానాకు గండికొట్టినట్లు గమనించింది.