తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఈఎస్ఐ మెడికల్ స్కామ్‌లో దేవికారాణి ఆస్తులు బయట పడుతూనే ఉన్నాయి. దర్యాప్తులో భాగంగా ఏసీబీ అధికారులు పెద్ద మొత్తంలో ఉన్న ఆమె ఆస్తులను గుర్తించారు. రెండు రాష్ట్రాల్లోనూ కలిపి 50 చోట్ల దేవికా రాణి ఆస్తులను గుర్తించగా.. వీటి విలువ రూ. 200 కోట్ల వరకు ఉంటుందని భావిస్తున్నారు.

హైదరాబాద్ షేక్‌ పేట్‌లో రూ.4 కోట్ల విలువైన విల్లా, సోమాజిగూడలో 3 ఫ్లాట్లు, షేక్‌పేట్‌లో ఆదిత్య టవర్స్‌లో మూడు ఫ్లాట్లు, చిత్తూరులో రూ.కోటి విలువైన భవనం, హైదరాబాద్ నానక్‌రామ్ గూడలో ఇండిపెండెంట్ భవనం, రెండు రాష్ట్రాల్లోనూ 11 చోట్ల ఓపెన్ ఫ్లాట్లు, తెలంగాణలో ఏడు చోట్ల 32 ఎకరాల వ్యవసాయ భూమిని ఏసీబీ అధికారులు గుర్తించారు. 

Also Read:ఈఎస్ఐ స్కాంలో సంచలన విషయాలు: రూ.46 కోట్ల ఇండెంట్లు స్వాధీనం

తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈఎస్ఐ స్కాంలో తవ్వుతున్న కొద్దీ అక్రమాలపుట్ట కదులుతోంది. ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు అక్టోబర్ 2న ఓమ్నీ సంస్థ ఏజెంట్ నాగరాజు నివాసంలో సోదాలు నిర్వహించారు. 

ఈసోదాలో భారీగా డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు ఏసీబీ అధికారులు. అధికార పత్రాలు, సుమారు రూ.46 కోట్ల విలువైన ఇండెంట్లను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. భారీగా రూ.46 కోట్ల మేర విలువైన ఇండెంట్లు ఏజెంట్ల ఇళ్లలో లభ్యం కావడంతో ఏసీబీ అధికారులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. 

ఈఎస్ఐ డైరెక్టర్ కార్యాలయంలో ఉండాల్సిన ఇండెంట్లు ఏజెంట్ నాగరాజు నివాసంలో ఉండటంపై అవినీతి శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ కేసుకు సంబంధించి మరికొంతమంది అధికారులు, ప్రైవేట్ వ్యక్తులను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసే అవకాశం ఉంది. 

Also Read:ఈఎస్‌ఐ స్కాం: ఉచ్చు బిగుస్తున్న ఏసీబీ అధికారులు

ఇకపోతే ఈఎస్ఐ మందుల కుంభకోణంలో ఓమ్నీ మెడి సంస్థ నుంచి భారీగా ఔషధాలు, పరీక్షల కిట్లు ఈఎస్ఐ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఈఎస్ఐ డైరెక్టర్ దేవికారాణితోపాటు పలువురు అధికారులు రిమాండ్ లో ఉన్నారు.