హైదరాబాద్: ఈఎస్ఐ స్కాంపై ఏసీబీ అధికారులు దర్యాప్తును మరింత వేగవంతం చేశారు. సోమవారంనాడు అరెస్ట్ చేసిన సురేంద్రనాథ్ బాబును ఏసీబీ అధికారులు మంగళవారం నాడు కోర్టులో హాజరుపర్చారు. కోర్టు సురేంద్రనాథ్ బాబుకు రిమాండ్ విధించింది. మరో వైపు పాత రికార్డులను కూడ ఏసీబీ అధికారులు  పరిశీలించనున్నారు.

 ఈఎస్ఐ స్కాంపై  ఇప్పటికే ఏసీబీ అధికారులు ఈఎస్ఐ డైరెక్టర్ దేవికారాణితో పాటు మరో ఏడుగురిని అరెస్ట్ చేశారు. సోమవారం నాడు సురేంద్రనాథ్ బాబు అనే అధికారిని  ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు మంగళవారం నాడు ఆయననను కోర్టులో హాజరుపర్చారు.

ఈ కేసులో ఏసీబీ అధికారులు మరికొందరిని విచారించనున్నారు. సెంట్రల్ డ్రగ్స్ స్టోర్స్‌లో కూడ ఏసీబీ అధికారులు విచారణ చేయాలని భావిస్తున్నారు. మరో వైపు  ఈఎస్ఐ డిస్పెన్సరీలలో మరోసారి తనిఖీలను నిర్వహించనున్నారు.

కొందరు ఫార్మసిస్టులను బెదిరించి సురేంద్రనాథ్ బాబు తప్పుడు బిల్లును సృష్టించారని  ఏసీబీ అధికారులు గుర్తించారు. సురేంద్రనాథ్ బాబు కొందరు ఫార్మసిస్టులను బెదిరించిన ఆడియో టేపులను కూడ ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకొన్నట్టు సమాచారం. ఈ  విషయమై ఏసీబీ అధికారులు సురేంద్రనాథ్ ను కస్టడీకి తీసుకొని విచారణ చేయాలని  భావిస్తున్నారు.

మరో వైపు నిందితులు బెయిల్ కోరుతూ ఏసీబీ కోర్టులో మంగళవారం నాడు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై కోర్టు విచారణ చేయనుంది. నిందితులను కస్టడీ తీసుకోవాలని  ఏసీబీ  అధికారులు భావిస్తున్నారు.