షాక్: ఎర్రబెల్లి ప్రదీప్ రావు టీఆర్ఎస్ కు రాజీనామా
టీఆర్ఎస్ కు రాజీనామా చేస్తున్నట్టుగా ఎర్రబెల్లి ప్రదీప్ రావు ప్రకటించారు. వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నరేందర్ రావు చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. బంగారు తెలంగాణ సాధన కోసమే తాను ఇంతకాలం టీఆర్ఎస్ లో కొనసాగినట్టుగా ప్రదీప్ రావు చెప్పారు.
వరంగల్: టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టుగా ఎర్రబెల్లి ప్రదీప్ రావు ప్రకటించారు. తనకు ఏమైనా జరిగితే దానికి వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నరేందర్ రావుదే బాధ్యతని ఆయన చెప్పారు.
ఆదివారం నాడు వరంగల్ లో టీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి ప్రదీప్ రావు మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే నరేందర్ అనుచరుల నుండి తమకు బెదిరింపులు వస్తున్నాయని కూడా ఆయన చెప్పారు. తాను తన అనుచరులతో సమావేశాలు నిర్వహిస్తున్న సమయంలో తనను ఉద్దేశించి అసభ్యంగా మాట్లాడారన్నారు. తాను పార్టీలోనే ఉన్న సమయంలో తనను ఉద్దేశించి ఎమ్మెల్యే నరేందర్ రావు చేసిన వ్యాఖ్యలను ప్రదీప్ రావు తప్పుబట్టారు.
తెలంగాణ ఉద్యమం కోసం తాను పనిచేసినట్టుగా చెప్పారు. బంగారం తెలంగాణ సాధన కోసం తాను అనేక త్యాగాలు చేసినట్టుగా ఎర్రబెల్లి ప్రదీప్ రావు చెప్పారు. ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోయినా కూడా తాను బంగారు తెలంగాణ కోసం టీఆర్ఎస్ బలోపేతం కోసం పనిచేసినట్టుగా ఆయన చెప్పారు.
తన సహకారం లేకుండానే నరేందర్ రావు ఎమ్మెల్యేగా విజయం సాధించినట్టుగా చెబుతున్నారన్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి నరేందర్ రావు తన మద్దతు లేకుండా విజయం సాధించాలని ప్రదీప్ రావు సవాల్ విసిరారు. ఈ నెల 10వ తేదీ లోపుగా తన సఃవాల్ ను స్వీకరించాలని ఆయన డిమాండ్ చేశారు. నరేందర్ స్పందన కోసం తాను ఎదురు చూస్తున్నట్టుగాచెప్పారు. నరేందర్ స్పందన వచ్చిన తర్వాతే తానే ఏదైనా పార్టీలో చేరుతానని ప్రదీప్ రావు స్పష్టం చేశారు. తాను పార్టీలోనే ఉన్న సమయంలోనే కోస్తా, చీరుస్తా అని నరేందర్ రావు బెదిరింపులకు పాల్పడ్డారని ప్రదీప్ రావు ఆరోపణలు చేశారు. వరంగల్ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గంలో రూ. 4 వేల కోట్ల అభివృద్ది పనులకు ఖర్చు చేసినట్టుగా ఎమ్మెల్యే చెబుతున్నారన్నారు. ఎక్కడ రూ. 4 వేల కోట్లు ఖర్చు పెట్టారని చూపించాలని ఆయన డిమాండ్ చేశారు.
పలు దఫాలు కూడా పార్టీ నాయకత్వం తనను పిలిచి నీకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చిందన్నారు. ఎమ్మెల్సీ పదవిని ఇస్తామని కూడా ఇవ్వలేదన్నారు. . పార్టీలో ఉన్నా కూడా తనకు గుర్తింపు ఇవ్వడం లేదన్నారు వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నరేందర్ రావు తనను అసభ్యంగా దూషించినా కూడా పార్టీ నేతలు ఎవరూ కూడా ఖండించకపోవడాన్ని కూడా ప్రదీప్ రావు ప్రస్తావించారు. తాను ఇంకా పార్టీలోనే కొనసాగుతాననే ఉద్దేశ్యంతోనే నరేందర్ రావు తనను అసబ్యంగా దూషించారేమోనని ఆయన అభిప్రాయపడ్డారు.
గత వారంలో ఎర్రబెల్లి ప్రదీప్ రావుతో మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య భేటీ అయ్యారు.పార్టీని వీడొద్దని కూడా బస్వరాజు సారయ్య ప్రదీప్ రావుకు సూచించారు. పార్టీ నాయకత్వం ముందు ఎర్రబెల్లి ప్రదీప్ రావు కొన్ని డిమాండ్లు ఉంచారు. అయితే ఈ డిమాండ్లను పార్టీ నాయకత్వానికి తెలుపుతానని బస్వరాజు సారయ్య ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ తరుణంలోనే ఎమ్మెల్యే నరేందర్ రావు తనను దూషించాడని ప్రదీప్ రావు గుర్తు చేశారు.
ఎర్రబెల్లి ప్రదీప్ రావు బీజేపీలో చేరడానికి రంగం సిద్దం చేసుకొన్నారు. త్వరలోనే ఆయన బీజేపీలో చేరే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సోదరుడే ప్రదీప్ రావు.