బ్రోకర్ దందా జేయాలే.. సైసలు తీసుకోవాలే.. రేవంత్ రెడ్డి పై ఎర్రబెల్లి దయాకర్ సంచలన వ్యాఖ్యలు
Errabelli Dayakar Rao: తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి పై బీఆర్ఎస్ సీనీయర్ నాయకులు, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. "రేవంత్ రెడ్డి నువ్వు ఓటు నోటు కేసులో జైలు నుండి బైటికి వచ్చిన తరువాత ఏడుస్తూ వచ్చి నా కాళ్ళు పట్టుకున్న విషయం మర్చిపోయినవా? అని" ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
Telangana Assembly Elections 2023: పాలకుర్తి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.. తన నియోజకవర్గంలో విస్కృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు (కేసీఆర్) పాలనలో తెలంగాణ అపూర్వ ప్రగతి సాధించిందన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి లభించిన అనేక ప్రశంసలు, గుర్తింపులు ఈ పురోగతికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్, బీజేపీలు ఇచ్చిన బూటకపు వాగ్దానాలకు మోసపోవద్దనీ, పాలకుర్తి నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని గుర్తించాలని ఓటర్లను కోరారు.
ఈ క్రమంలోనే తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి పై బీఆర్ఎస్ సీనీయర్ నాయకులు, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓటుకు నోటు కేసుకు సంబంధించిన విషయాలు ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. "రేవంత్ రెడ్డి నువ్వు ఓటు నోటు కేసులో జైలు నుండి బైటికి వచ్చిన తరువాత ఏడుస్తూ వచ్చి నా కాళ్ళు పట్టుకున్న విషయం మర్చిపోయినవా? ఒక ఉన్నతమైన కుటుంబంలో పుట్టావు.. బ్రోకరిజం, దందాలు బంజేయమని ఎన్నోసార్లు చెప్పినా నువ్వు వినలేదని" ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
దయన్న నీ అంతమంచిగా ఉంటే నడవదని రేవంత్ చెప్పినట్టు తెలిపారు. "బ్రోకర్ దందాలు చేయాలే.. పైసలు తీసుకోవాలే.. దయన్న నీలాగ నీతిగుంటే ఎవరూ రాజకీయంగా ఎదుగరు" అని రేవంత్ తనతో చెప్పినట్టు ఎర్రబెల్లి పేర్కొన్నారు. ఇదిలావుండగా, తనను జైలుకు పంపేందుకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రాజకీయ ప్రత్యర్థులతో కలిసి కుట్ర పన్నారనీ, అలాంటి వ్యక్తిని మిత్రుడిగా నమ్మలేమని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఏ.రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి యశస్వినిరెడ్డికి మద్దతుగా పాలకుర్తిలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. దయాకర్‌రావు పక్కా ప్రణాళికతో తన స్నేహితులకు, తెలుగుదేశం పార్టీకి ద్రోహం చేసి తాను చేరాలనుకున్న పార్టీని బలోపేతం చేశారన్నారు. రేషన్ డీలర్‌గా ఉన్న మంత్రి ఇప్పుడు డాలర్ దయాకర్‌రావుగా మారి ప్రజల ఆస్తులను దోచుకున్నారని ఆరోపించారు.