మంత్రి ఈటల రాజేందర్ భూ ఆక్రమణల వ్యవహారంలో అచ్చంపేట భూముల ప్రాథమిక నివేదిక తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్‌కు అందింది. ఇప్పటి వరకు పది మంది బాధితుల్ని విచారించారు విజిలెన్స్ అధికారులు.

ఇప్పటికే అచ్చంపేట, హకీంపేట్‌లలో భూములను పరిశీలించారు విజిలెన్స్ డీజీ. కబ్జా చేశారని ఆరోపణలున్న 177 ఎకరాల్లో సర్వే కొనసాగుతోంది. డిజిటల్ సర్వే పూర్తి కాగానే ప్రభుత్వానికి పూర్తి స్థాయి నివేదిక అందనుంది. 

వైద్య ఆరోగ్య శాఖ నుంచి తనను తొలగించడంపై మంత్రి ఈటల రాజేందర్ స్పందించారు. శాఖ తొలగించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఈటల ధన్యవాదాలు తెలిపారు. త్వరలోనే నియోజకవర్గ ప్రజలతో సమావేశమై కార్యాచరణ ప్రకటిస్తానని రాజేందర్ వెల్లడించారు.

Also Read:'భూమి బద్దలు': పేలిన ఈటెల రాజేందర్ వ్యూహం, చిక్కుల్లో కేసీఆర్

ప్రజలకు మెరుగైన సేవలు అందేలా వైద్య ఆరోగ్య శాఖను సీఎం తీసుకున్నారని ఈటల చెప్పారు. తనకు ఏ శాఖ లేకున్నా ప్రజలకు సేవ చేస్తానని రాజేందర్ తేల్చి చెప్పారు. ప్రణాళిక ప్రకారం తనపై కుట్ర జరుగుతుందని ఆయన ఆరోపించారు.

రాబోయే రోజుల్లో తగిన మూల్యం చెల్లించుకుంటారని రాజేందర్ హెచ్చరించారు. సీఎం కేసీఆర్‌తో మాట్లాడేందుకు ప్రయత్నం చేయనని ఆయన స్పష్టం చేశారు. ఏ శాఖనైనా తీసుకునే అధికారం సీఎంకు వుందని రాజేందర్ వెల్లడించారు. 

అంతకుముందు తెలంగాణ రాజకీయాలను ఒక్కసారిగా వేడెక్కించిన మంత్రి ఈటల రాజేందర్ వ్యవహారంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఈటల నిర్వర్తిస్తున్న వైద్య ఆరోగ్య శాఖను సీఎం కేసీఆర్‌కు కేటాయిస్తూ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో రాష్ట్ర కేబినెట్‌లో ఏ శాఖ లేని మంత్రిగా ఈటల రాజేందర్ వుండనున్నారు.