బీఆర్ఎస్ నాయకుడు అనుచితంగా మాట్లాడాడని మనస్తాపంతో దేవాదాయశాఖ పర్యవేక్షకురాలు ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన ఖమ్మంలో కలకలం రేపింది. 

ఖమ్మం : ఖమ్మం డివిజన్ దేవాదాయ శాఖ పర్యవేక్షకురాలు ఆత్మహత్యాయత్నం చేసింది. బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు నతో అనుచితంగా వ్యవహరించారని ఆవేదన వ్యక్తం చేసింది. అగౌరవంగా మాట్లాడారని ఆరోపించింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాల మేరకు.. రెంటల సమత ఉమ్మడి ఖమ్మం జిల్లా దేవాదాయ, ధర్మాదాయ శాఖ జిల్లా పర్యవేక్షకురాలిగా వ్యవహరిస్తున్నారు. మంగళవారం ఆమెకు ఎంపీపీ భర్త, ఖమ్మం గ్రామీణ మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు బెల్లం వేణు ఫోన్ చేశారు. ఆ ఫోన్ లో అతను ఆమెతో మాట్లాడుతూ తనకు మారెమ్మ దేవాలయ ట్రస్టు బోర్డు నోటిఫికేషన్ విషయం ఎందుకు చెప్పలేదని తీవ్రంగా ప్రశ్నించారు. 

దీనికి సమత మాట్లాడుతూ.. మారెమ్మ దేవాలయ ట్రస్టు బోర్డు నోటిఫికేషన్ వివరాలను దేవాలయం, ఎంపీడీవో, తహసీల్దార్, ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో నోటిఫికేషన్ అంటించామని సమాధానమిచ్చారు. దీంతో కోపానికి వచ్చిన బెల్లం వేణు అలా కాదని తనకు పర్సనల్ గా చెప్పాల్సిన బాధ్యత లేదా అంటూ దురుసుగా మాట్లాడాడు. దీంతో సమత తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. తన కార్యాలయంలో ఉన్న మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. 

అసెంబ్లీలో తమకు రూమ్‌ కూడా లేదన్న ఈటల రాజేందర్.. సభలో బడ్జెట్‌పైనే మాత్రమే మాట్లాడాలని మంత్రుల కౌంటర్..

నోటిఫికేషన్ విషయంలో మహిళ అని కూడా చూడకుండా బెల్లం వేణు అనుచితంగా మాట్లాడారాని ఆరోపించారు. ఈ మేరకు తన ఫోన్ లో రికార్డయిన కాల్ రికార్డింగును విలేకర్లకు వినిపించారు. ఆ మాటలకు తట్టుకోలేక.. మనస్తాపంతో బీపీతో పాటు మరో ఇతర 20 మాత్రలు వేసుకున్నట్లు ఆమె చెప్పారు. మాట్లాడుతున్నప్పటికే ఆమె అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను మిగతా ఉద్యోగులు ఖమ్మం సర్వజనాసుపత్రికి తీసుకెళ్లారు. ఈఘటన తెలియడంతో దేవాదాయశాఖ సహాయ కమిషనర్ ఎ. సులోచన సూర్యాపేట నుంచి వచ్చి సమతను పరామర్శించారు. ఆమెకు ప్రాణాపాయం లేదని.. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు. 

దేవాదాయ శాఖ ఉద్యోగులు, అర్చకులు, టీఎన్జీవోస్ నాయకులు ఈ ఘటన మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. సమతకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఆమె ఆత్మహత్యాయత్నానికి కారకుడైన బెల్లం వేణును అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆసుపత్రి ప్రధాన ద్వారం వద్ద ఆందోళన నిర్వహించారు. ఆ తరువాత కలెక్టర్ గౌతమ్, సీపీ విష్ణులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు నిందితుడు బెల్లం వేణుపై పోలీసులు కేసు నమోదు చేశారు.

దీనిమీద ఆరోపణలు ఎదుర్కొంటున్న బెల్లం వేణు మాట్లాడుతూ.. మంగళవారం నోటిఫికేషన్ గురించి సమతకు ఫోన్ చేసింది నిజమేనని.. దాని గురించి అడిగానన్నారు. నవంబరులోనే నోటిఫికేషన్ వచ్చిందని ఆమె చెప్పిందన్నారు. అంతేకాదు ఇప్పుడు సమయం ముగిసిందని చెప్పారని, ఆలయ ఈవోను అడిగితే నోటిఫికేషనే రాలేదని చెప్పాడని అందుకే గట్టిగా ప్రశ్నించానని వివరణ ఇచ్చారు. దీంతో.. ఎంపీపీకి సమాచారం ఇవ్వలి కదా.. ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించానన్నారు. దానికి ఆమె ఎంపీపీకి చెప్పాల్సిన అవసరం లేదంటూ ఫోన్ కట్ చేసిందని వేణు వివరణ ఇచ్చారు.