బల్దియా ఎన్నికల సమరం మొదలైంది. ప్రజలు ఉదయాన్నే తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇప్పటి వరకు ఎన్నికలు ప్రశాంతంగా సాగాయి. కాగా.. తాజాగా.. ఈ ఎన్నికల్లో ఓ పొరపాటు జరిగినట్లు గుర్తించారు. ఇద్దరి వ్యక్తుల ఎన్నికల గుర్తు తారుమారు అయ్యింది. ఈ సంఘటన మలక్ పేటలో చోటుచేసుకోగా.. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఓల్డ్‌ మలక్‌పేట్‌ డివిజన్‌లో గుర్తులు తారుమారయ్యాయి. బ్యాలెట్‌ పత్రంలో సీపీఐ అభ్యర్థి గుర్తు కంకి కొడవలికి బదులు, ఎదురుగా సీపీఎం అభ్యర్థి గుర్తు సుత్తి కొడవలి ఉంది. ఈవిషయమై ఎన్నికల అథారిటీ నివేదిక ఆధారంగా ఎస్‌ఈసీ నిర్ణయం తీసుకోనుంది. కాగా.. ఇలా గుర్తులు తారుమారు కావడం పట్ల జిహెచ్ యంసి కమిషనర్ ను రాష్ట్ర ఎన్నికల సంఘం నివేదిక కోరింది. ఈ నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా.. ప్రస్తుతానికి ఓటింగ్ మందకోడిగా సాగుతోంది. ఇప్పటికే పలువురు రాజకీయ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కేటీఆర్, కిషన్ రెడ్డిలు తమ భార్యలతో సహా వచ్చి ఓటు వేశారు. కాగా.. పలువురు సినీ ప్రముఖులు కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది.