తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక.. నామినేషన్ దాఖలు చేయనున్న గడ్డం ప్రసాద్ కుమార్
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ (Telangana Assembly Speaker) పదవి కోసం కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ (Gaddam Prasad Kumar) నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఆయన వికారాబాద్ (vikarabad) నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ ఎన్నిక ఏకగ్రీవమే కానుంది.
Gaddam Prasad Kumar : తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పదవి కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పదవికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ బుధవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. ప్రస్తుతం ఆయన వికారాబాద్ నుంచి శాసన సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. స్పీకర్ పదవి కోసం కాంగ్రెస్ హైకమాండ్ ఆయనను ఎంపిక చేసింది.
అయితే ఈ పదవికి బీఆర్ఎస్ తన అభ్యర్థిని నిలబెట్టే అవకాశాలు లేవు. కాబట్టి స్పీకర్ గా ఆయన ఎన్నిక కేవలం లాంఛనప్రాయంగానే మారనుంది. గడ్డం ప్రసాద్ కుమార్ ఏకగ్రీవంగా స్పీకర్ పదవికి ఎన్నిక కానున్నారు. ఈ పదవి కోసం సోమవారం నోటిఫికేషన్ విడుదల కాగా.. బుధవారం ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. డిసెంబర్ 14న ఎన్నికలు జరగనున్నాయి.
కాగా.. ప్రొటెం స్పీకర్ గా నియమితులైన ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ డిసెంబర్ 9న కొత్త ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించారు. అయితే నిబంధనలను ఉల్లంఘించి ఒవైసీని కాంగ్రెస్ పార్టీ ప్రొటెం స్పీకర్ గా నియమించిందని బీజేపీ ఆరోపించింది. దీంతో ఆ పార్టీ ఎమ్మెల్యే శాసన సభకు హాజరుకాలేదు. వారంతా ప్రమాణ స్వీకారం కూడా చేయలేదు.
శాశ్వత స్పీకర్ వచ్చిన తరువాతే తాము ప్రమాణ స్వీకారం చేస్తామని బీజేపీ ఎమ్మెల్యేలు ఇప్పటికే స్పష్టం చేశారు. ఆ పార్టీకి అసెంబ్లీలో 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కాగా.. సిరిసిల్ల నుంచి అసెంబ్లీకి ఎన్నికైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కూడా ఇంకా ప్రమాణ స్వీకారం చేయలేదు. మాజీ సీఎం కేసీఆర్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న నేపథ్యంలో తనకు మరో రోజు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఇవ్వాలని కేటీఆర్ లేఖ రాశారు. దీంతో ఆయన కూడా శాశ్వత స్పీకర్ సమక్షంలోనే ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు ఉన్నాయి.
ఇదిలా ఉండగా.. ఇటీవల తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆ పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ పార్టీ నుంచి 64 మంది ఎమ్మెల్యేలు విజయం సాధించారు. దాని మిత్రపక్షంగా ఉన్న సీపీఐ నుంచి ఒకరు ఎమ్మెల్యేగా గెలుపొందారు. మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్న ధీమాతో ఉన్న బీఆర్ఎస్ 39 స్థానాలు గెలుచుకుంది. ఈ సారి అధికారంలోకి రావాలని తీవ్రంగా ప్రయత్నించిన బీజేపీ 8 స్థానాలు గెలుచుకొని మూడో స్థానంలో నిలిచింది. ఎంఐఎం గతంలో గెలిచిన తన 7 స్థానాలను మళ్లీ కైవసం చేసుకొంది.