Asianet News TeluguAsianet News Telugu

సింగరేణిలో టిఆర్ఎస్ కు కొత్త షాక్

  • గుర్తింపు సంఘం కాలం కుదింపు
  • నాలుగేళ్లకు బదులు రెండేళ్లే
  • అధికార దుర్వినియోగం, ప్రలోభాలపై ఫిర్యాదులు
  • ఆగ్రహం వ్యక్తం చేసిన గుర్తింపు సంఘం
election commission shock to tbgks

సింగరేణి కార్మిక సంఘం ఎన్నికలు జరిగి రెండు నెలలకు పైగా కావొస్తున్నది. అక్కడ ఎన్నికల్లో అధికార టిఆర్ఎస్ పార్టీ అనుబంధమైన తెంలగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టిబిజికెఎస్) ఘన విజయం సాధించింది. ఇదంతా మనకు తెలిసిందే. మళ్లీ కొత్త షాక్ ఏంటబ్బా? అనుకుంటున్నారా? ఎదురే లేకుండా గెలిచిన సంఘానికి షాక్ ఇచ్చిందెవరనుకుంటున్నారా? అయితే చదవండి.

మొన్న జరిగిన సింగరేణి ఎన్నికల్లో పేరుమోసిన జాతీయ సంఘాలన్నీ జట్టు కట్టాయి. టిఆర్ఎస్ అనుబంధ మైన తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఒంటరి పోరాటం చేసింది. ఎంపి కవిత అక్కడే మకాం వేసి, మంత్రులు, ఎమ్మెల్యేలు, యావన్మంది పార్టీ నేతలంతా బరిలోకి దిగి తమ సంఘాన్ని గెలిపించారు. ఇంతవరకు అయితే బాగానే ఉండేది.. కానీ ఏకంగా ముఖ్యమంత్రి కేసిఆర్ ఈ గుర్తింపు సంఘం ఎన్నికల ప్రచార బరిలోకి దిగారు. రాష్ట్ర ప్రభుత్వం తరుపున అన్ని రకాల ప్రలోభాలకు గురిచేశారన్న ఆరోపణలు గుప్పుమన్నాయి. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు కేంద్ర కార్మిక సంఘాలు కేంద్ర ఎన్నికల సంఘానికి అప్పట్లోనే ఫిర్యాదులు చేశాయి.

ఈ పరిస్థితుల్లో సింగరేణి కార్మిక సంఘం ఎన్నికలు జరిగి రెండు నెలలు గడుస్తున్నా కేంద్ర కార్మిక శాఖ ఫలితాలను ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించలేదు. గెలిచిన వారికి గుర్తింపు పత్రాలు కూడా జారీ చేయలేదు.  దానికి కారణం ఎఐటియుసి అనుబంధ సింగరేణి కార్మిక సంఘంతోపాటు మిగతా జాతీయ కార్మిక సంఘాలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసిఆర్ స్వయంగా రంగంలోకి దిగారని ఆరోపించాయి. సిఎం స్థాయి వ్యక్తి స్వయంగా ప్రలోభాలకు గురిచేశారని ఫిర్యాదుల్లో వివరించారు. ఈ ఆరోపణల తాలూకు ఆధారాలను కూడా ఎన్నికల సంఘానికి అందజేశాయి.

ఈ నేపథ్యంలో సింగరేణి ఎన్నికలను రద్దు చేస్తారన్న ప్రచారం కూడా సాగింది. రెండు నెలలుగా కేంద్ర ఎన్నికల సంఘం నుంచి సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలపై అధికారిక ప్రకటన రాలేదు. తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం ఊహించని షాక్ ఇస్తూ తన నిర్ణయాన్న వెలువరించింది. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు నాలుగేళ్ల కాలానికి జరిగినా... ప్రలోభాల ఆరోపణలు, అధికార దుర్వినియోగం ఆరోపణలను కేంద్ర ఎన్నికల సంఘం పరిగణలోకి తీసుకుంది. అందుకే నాలుగేళ్ల కాలానికి కాకుండా రెండేళ్ల కాలానికి టిఆర్ఎస్ సంఘాన్ని గుర్తింపు సంఘంగా ప్రకటిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు ఇచ్చింది. ఎన్నికల సంఘం ఉత్తర్వుల మేరకు కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ నుంచి సింగరేణికి గుర్తింపు కుదింపు ఆదేశాలు అందాయి. సింగరేణి సిఎండి కి కార్మిక శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఐఆర్ (ఐఎంపి 1) ఆర్కే అగర్వాల్ లేఖ రాశారు. కోడ్ ఆఫ్ డిసిప్లిన్ ప్రకారం సింగరేణి కార్మిక గుర్తింపు సంఘం పదవీకాలాన్ని రెండేళ్లకు కుదించి నిర్దారించినట్లు ఆ లేఖలో పేర్కొన్నారు. కేంద్ర కార్మిక, పాధి కల్పన శాఖ సూచనమేరకే ఈ నిర్ణయాన్ని వెలువరించినట్లు లేఖలో పేర్కొన్నారు.

భగ్గుమంటున్న టిబిజికెఎస్

కేంద్ర కార్మిక శాఖ తీసుకున్న నిర్ణయం పై గుర్తింపు సంఘం తెలంగాణ బొగ్గుగని కార్మిక సంగం ఆగ్రహం వ్యక్తం చేసింది. గతంలో ఉన్న విధానాలను పక్కనపెట్టి కేంద్ర కార్మిక శాఖ ఏకపక్షంగా ఎలా నిర్ణయం వెలువరించిందని ప్రశ్నిస్తున్నారు. గతంలో పదవీ కాలాన్ని మార్చాలంటే కార్మిక సంఘాలతో చర్చించి సింగరేణి బోర్డులో చర్చించి నిర్ణయం తీసుకునేవారని చెబుతున్నారు. ఈ నిర్ణయంపై పోరాటం చేసే యోచనలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఉన్నట్లు తెలుస్తోంది.

Follow Us:
Download App:
  • android
  • ios