Asianet News TeluguAsianet News Telugu

Election Commission: ఎన్నికల వేళ ధన ప్రవాహం.. 5 రాష్ట్రాల్లో ఎన్ని వేల కోట్ల నగదు సీజ్ చేశారంటే..?

Election Commission: దేశంలోని 5 రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం కఠినంగా వ్యవహరిస్తోంది. విస్త్రుతంగా తనిఖీలు నిర్వహిస్తూ.. భారీ మొత్తం లో నగదు, బంగారం, ఇతర విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకూ ఎన్ని కోట్లు పట్టుకున్నారంటే..?  

Election Commission Seized Drugs Cash Liquor Worth Over Rs 1760 Crore  In Five States KRJ
Author
First Published Nov 20, 2023, 8:40 PM IST | Last Updated Nov 20, 2023, 8:40 PM IST

Election Commission: దేశంలోని తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, రాజస్థాన్, మిజోరాంలలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఓటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకోవడానికి బరిలో నిలిచిన అభ్యర్థులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. వారిని వశం చేసుకోవడానికి నగదు, మద్యం, విలువైన లోహాలను అందిస్తూ ప్రలోభపెడుతున్నారు. దీంతో ఓటర్లకు ప్రలోభాలపై ఎన్నికల సంఘం ప్రత్యేక ద్రుష్టి పెట్టింది.

ఆయా రాష్ట్రాల అధికారులు, పోలీసుల సమన్వయంతో  పకడ్బందీ చర్యలు చేపట్టింది. విస్తృతంగా తనిఖీలు చేపడుతూ.. కఠినంగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలో  భారీ మొత్తంలో అక్రమంగా తరలిస్తున్న నగదు, మద్యం, ఇతర వస్తువులను పట్టుకుంటుంది. కాగా.. తాజాగా ఐదు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు ఎంత సొమ్ము పట్టుబడిందనే విషయాలను సోమవారం ఎలక్షన్ కమిషన్ వెల్లడించింది. 

ఈ మేరకు మొత్తం రూ.1760 కోట్ల విలువైన అక్రమ నగదు, మద్యం, మాదక ద్రవ్యాలు, బహుమతులు, ఇతర విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు Election Commission వెల్లడించింది. ఈ రాష్ట్రాల్లో 2018లో అసెంబ్లీ ఎన్నికలు (Assembly Elections) జరగగా.. ఆ సమయంలో సీజ్‌ చేసిన దాంతో పోలిస్తే.. ప్రస్తుతం స్వాధీనం చేసుకున్న మొత్తం దాదాపు ఏడు రెట్లు ఎక్కువ అని తెలిపింది.  

గత ఎన్నికల్లో ఇవే రాష్ట్రాల్లో రూ.239.15 కోట్లు పట్టుబడినట్లు తెలిపింది. ఇందులో తెలంగాణలోనే అత్యధికంగా దాదాపు రూ.659 కోట్ల పైగా స్వాధీనం చేసుకున్నట్టు వివరించింది. ఆ తరువాత స్థానాల్లో  వరుసగా రాజస్థాన్ (రూ.650.7 కోట్లు), మధ్యప్రదేశ్ (రూ.323.7 కోట్లు), ఛత్తీస్ గఢ్  (రూ.76.9 కోట్లు) నిలిచాయి.

అక్కడ ముగిసిన పోలింగ్

ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారం.. ఛత్తీస్‌గఢ్‌, మిజోరం, మధ్యప్రదేశ్‌లో పోలింగ్ ముగిసింది. ఇక రాజస్థాన్ లో ఈ నెల 25న , తెలంగాణలో 30న ఎన్నికల పోలింగ్ జరుగనున్నది. ఈ నేపథ్యంలో నిర్వహించిన తనిఖీల్లో తెలంగాణలోనే అత్యధికంగా నగదు పట్టుకున్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది.

మిజోరాంలో ఎలాంటి నగదు దొరకలేదు, కానీ రూ.29.82 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను సీజ్ చేసినట్టు పేర్కొంది.ఇక తెలంగాణలో రూ.225.23 కోట్ల నగదు, రూ.86.82 కోట్ల విలువైన మద్యం, రూ.103.74 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలు, రూ.191.02 కోట్ల విలువైన బంగారం, వెండి, ఆభరణాలు, రూ.52.41 కోట్ల విలువైన వస్తువులను సీజ్ చేసినట్టు ఈసీ అధికారులు వెల్లడించారు. పోలింగ్ ముగిసే నాటికి ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios