దుబ్బాక ఉప ఎన్నికలో భారతీయ జనతా పార్టీ అభ్యర్ధి రఘునందన్ రావు విజయం సాధించినట్లు తెలంగాణ ఎన్నికల కమీషన్ ప్రకటించింది. టీఆర్ఎస్ అభ్యర్ధి సోలిపేట సుజాతపై 1,079 ఓట్ల తేడాతో బీజేపీ గెలిచినట్లు ఈసీ వెల్లడించింది.

అంతకుముందు దుబ్బాక ఉప ఎన్నికకు సంబంధించి ఇంకా నాలుగు ఈవీఎంలలోని ఓట్లను లెక్కించాల్సి ఉందని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ చెప్పారు.

మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. దుబ్బాక అసెంబ్లీ పరిధిలోని 21, 188 పోలింగ్ కేంద్రాల్లో ఇంకా రిజల్ట్ రాలేదని శశాంక్ చెప్పారు. ఈ రెండు పోలింగ్ కేంద్రాల్లోని నాలుగు ఈవీఎంలలో 1669 ఓట్లున్నాయని ఆయన వివరించారు.

Also Read:దుబ్బాక ప్రజలు చైతన్యవంతులు.. అందుకే నన్ను గెలిపించారు: రఘునందన్ రావు

సాంకేతిక సమస్యల కారణంగా ఈ ఓట్లను లెక్కించలేకపోవడానికి ఇబ్బందులు నెలకొన్నాయన్నారు. దీంతో ఈ నాలుగు ఈవీఎంలలోని వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించనున్నట్టుగా ఆయన తెలిపారు. 136, 157/ఎ పోలింగ్ కేంద్రాల్లో మాక్ పోలింగ్ తర్వాత క్లియర్ చేయలేదన్నారు.

నిబంధనల ప్రకారంగా ఓట్ల లెక్కింపును చేపడుతామని గోయల్ పేర్కొన్నారు. దుబ్బాకలో విజయం సాధించామని సంబురాలు జరుపుకుంటున్న బీజేపీ శ్రేణులకి ఈ వార్త షాకిచ్చింది.

దుబ్బాక ప్రజలు చైతన్యవంతులు కాబట్టే బీజేపీని గెలిపించారని  ఈ ఎన్నికల్లో విజయం సాధించిన రఘునందన్ రావు చెప్పారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత బీజేపీ నేత రఘునందన్ రావు మీడియాతో మాట్లాడారు. తనకు ఓటేసిన గెలిపించిన  నియోజకవర్గ ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.