తెలంగాణ శాసనసభకు ముందస్తు ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల కమిషన్ (ఈసి) సుముఖత వ్యక్తం చేయలేదని తెలుస్తోంది. ఇందుకు మూడు కారణాలను ఈసి చెబుతున్నట్లు సమాచారం. 

హైదరాబాద్: తెలంగాణ శాసనసభకు ముందస్తు ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల కమిషన్ (ఈసి) సుముఖత వ్యక్తం చేయలేదని తెలుస్తోంది. ఇందుకు మూడు కారణాలను ఈసి చెబుతున్నట్లు సమాచారం. నాలుగు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలతో పాటు తెలంగాణ శాసనసభ ఎన్నికలు ఈ ఏడాది డిసెంబర్ లో జరిపించుకోవాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఆశిస్తున్నారు. 

ముందస్తు ఎన్నికలకు తాము వ్యతిరేకత వ్యక్తంచేయడానికి ఈసి మూడు కారణాలను చూపించినట్లు తెలుస్తోంది. తెలంగాణలో ఎన్నికల జాబితాను సవరించాల్సి ఉంది. ఈ ప్రక్రియ వచ్చే ఏడాది జనవరి 1వ తేదీతో ముగుస్తుంది. ఇది మొదటి కారణం.

ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విలీనం చేశారు. అయితే, తెలంగాణ శాసనసభ్యుడు వాటికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆ ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్ నియోజకవర్గాల్లో కలుపుతూ నోటిఫై చేయాల్సి ఉంటుంది. ఇది రెండవ కారణం.

తెలంగాణలో 1999 నుంచి లోకసభ ఎన్నికలతో పాటు శాసనసభ ఎన్నికలు జరుగుతున్నాయి. దాన్ని బ్రేక్ చేయడానికి ఈసి ఇష్టపడడం లేదు. ఇది మూడో కారణం. ఈ స్థితిలో తెలంగాణ అధికారులు ఇచ్చిన వివరణతో ఈసి సంతృప్తి చెందలేదని అంటున్నారు. 

ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి కేసిఆర్ హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరి వెళ్లినట్లు తెలుస్తోంది. ప్రధాని మోడీని కలిసి ముందస్తు ఎన్నికలు జరిగేలా చూడాలని కేసిఆర్ భావించినట్లు సమాచారం. అదే సమయంలో జమిలి ఎన్నికలకు తెలంగాణ ప్రభుత్వం సముఖత వ్యక్తం చేసిన విషయాన్ని ఈసి అధికారులు గుర్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. 

తెలంగాణ శాసనసభను సెప్టెంబర్ 6 లేదా 10వ తేదీన రద్దు చేస్తే, ఎన్నికలు నిర్వహించడానికి ఆరు నెలల గడువు ఉంటుంది. లోకసభ ఎన్నికలు 2019 ఏప్రిల్ లో జరగనున్నాయి. లోకసభ ఎన్నికల కన్నా ఒక నెల ముందు శాసనసభ ఎన్నికలు నిర్వహిస్తే అదనంగా రూ.3 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. దీంతో ఎవరైనా కోర్టుకు వెళ్తే న్యాయపరమైన చిక్కులు ఎదురు కావచ్చునని కూడా భావిస్తున్నారు. 

మరో విషయమేమిటంటే.... డిసెంబర్ లో జరిగే నాలుగు రాష్టాల ఎన్నికల్లో ఈవిఎంలతో పాటు వివిపిఎటి యంత్రాలను తొలిసారి పూర్తి స్థాయిలో వాడుతున్నారు. ఇందుకు సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. తెలంగాణలో డిసెంబర్ లో ఎన్నికలు నిర్వహించాలనుకుంటే సిబ్బందికి శిక్షణ ఇవ్వడం కూడా కష్టమవుతుందని అంటున్నారు. 

డిసెంబర్ లో ఎన్నికలు జరిగేలా ఎన్నికల కమిషన్ ను ఒప్పించడానికి తెలంగాణ ప్రభుత్వం శాయశక్తులా కృషి చేస్తోంది. వచ్చే వారం, పది రోజుల్లో ముందస్తు ఎన్నికలపై స్పష్టత ఇస్తామని మంత్రి కెటీఆర్ చెప్పారు. ఈ స్థితిలో సెప్టెంబర్ 2వ తేదీన జరిగే టీఆర్ఎస్ ప్రగతి నివేదన సభలో ముందస్తు ఎన్నికలపై కేసిఆర్ స్పష్టత ఇచ్చే అవకాశం లేదని అంటున్నారు.